Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

పిల్ల‌లూ దేవుడూ చ‌ల్ల‌నివారే..(నా) ??? Or, just some of them?

Sridhar Bollepalli

బ‌ళ్లో పిల్ల‌ల ఆగ‌డాలు భ‌రించ‌లేక‌పోత‌న్నామ‌నీ, తెల్లారుతుందంటే స్కూలుకి వెళ్లి వాళ్ల‌తో డీల్ చేయ‌డ‌మ‌నే ఆలోచ‌న‌కి వ‌ణుకు పుడుతోంద‌నీ వొక టీచ‌ర్‌గారు పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్లి మొర పెట్టుకున్న వార్త చూశాను నిన్న. బ‌య‌ట ఎంత‌మందికి తెలుసో లేదో నాకు ఐడియా లేదుగానీ ఈ ప‌రిస్థితి ఆ వొక్క స్కూలుకే ప‌రిమితం కాదు. బాల్యం అనే ప‌దానికి వ‌య‌సురీత్యా వుండే డెఫినిష‌న్ మార్చుకోవాల్సిన వాతావ‌ర‌ణం వుంది యిప్ప‌టి స‌మాజంలో.

ప‌దోత‌ర‌గ‌తి పూర్త‌య్యే వ‌ర‌కూ స్టూడెంట్స్ ని బాల‌లు అనాలా? ఇంట‌ర్‌వాళ్లు, డిగ్రీవాళ్లూ కూడా బాల‌లేనా? పాపం పుణ్యం ప్ర‌పంచ‌మార్గం క‌ష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ తెలియ‌ని వాళ్లంద‌రూ వ‌య‌సుతో సంబంధం లేకుండా బాల‌ల క్యాట‌గిరీ లోకి వ‌స్తారా? ఇవ‌న్నీ క్షుణ్ణంగా తెలిసిన‌వాళ్లు (ముఖ్యంగా నాలుగోది) ఫిజిక‌ల్‌గా లేత అయినా స‌రే మెంట‌ల్‌గా ముదుర్ల‌ని భావించి బాల‌లు కాద‌ని తీర్మానించొచ్చా?

నేనిలా అంటే మీలో చాలామంది ఏమంటారో నాకు తెలుసు. 'తెలిసీతెలియ‌నిత‌నం, కుటుంబ‌నేప‌ధ్యం, సినిమాల ప్ర‌భావం, చెడు స్నేహాలు, మార్కెట్ మాయాజాలం క‌లిసి ఆ లేత మ‌న‌సుల్లో విష‌బీజాలు నాటుతున్నాయి. టీచ‌ర్లే ప్రేమ‌గా వాళ్ల‌ని గాడిలో పెట్టాలీ' అని. తెల్లారిలేస్తే బండెడుచాకిరీ చేసి, వొళ్లు గుల్ల చేసుకొని పిల్ల‌ల‌కి కావాల్సిన‌వ‌న్నీ అమ‌ర్చిపెడితే మ‌న సొంత‌పిల్ల‌లే మ‌న మాట వింటార‌న్న గ్యారంటీ లేదు. ఇక బ‌ళ్లో పిల్ల‌లు వింటారా? ఒక మంచి టీచ‌ర్ ఎలాంటి మొండిఘ‌టాల్ని అయినా దారిలో పెట్ట‌గ‌ల‌డ‌నీ, అలా పెట్ట‌డం అత‌ని లేక ఆమె డ్యూటీలో భాగ‌మ‌నీ, అలా పెట్టగల వాతావరణం వుందనీ అంటారు అంతేనా? 😂

వారంలో క‌నీసం నాలుగురోజులు మందుకొడుతూ, త‌న‌క‌న్నా రెండేళ్లు చిన్న‌క్లాసులో వున్న అమ్మాయికి వేరేవాడితో ప్రేమ‌లేఖ‌లు రాయించి (వీడికి తెలుగు రాయ‌డం కూడా రాదు కాబ‌ట్టీ), అంతిమంగా ఆ అమ్మాయి చ‌దువు మానేయ‌డానికి కార‌ణం అయ్యి, త‌ర‌గ‌తిగ‌దిలో బ‌ల్ల‌ల‌మీదా గోడ‌ల‌మీదా అస‌భ్యంగా రాస్తూ, కాస్త మెత‌క‌గా వుండే లేడీటీచ‌ర్ల‌కి చుక్క‌లు చూపించే వాడొక‌డు వున్నాడ‌నుకోండీ..! (అనుకోవ‌డం కాదు.. ప్ర‌తి స్కూల్లోనూ చాలామంది వున్నారు ఈరోజు). మీవాడి ప్ర‌వ‌ర్త‌న యిలావుంది అని స‌ద‌రు ఘ‌నాపాటీ తాలూకూ త‌ల్లిదృష్టికో తండ్రిదృష్టికో తీసుకొస్తే, అస‌ల‌ది స‌మ‌స్యే కాన‌ట్టు వినేసి హ‌డావుడిగా అక్క‌ణ్నించీ వెళ్లిపోయార‌నుకోండీ..! ఏం చేయాలి? కొట్ట‌డం ప‌రిష్కారం కాదు.. (అలా కొట్టే అవ‌కాశం వుంటే అయిందానికీ కానిదానికీ పిల్ల‌ల మీద చేయిచేసుకునే రాక్ష‌సులు టీచ‌ర్ల‌లో వుంటారు కాబ‌ట్టీ.. అండ్ కొడితే మ‌రింత మొండికేయ‌డం త‌ప్ప వాడిలో మార్పు వ‌స్తుంద‌నే గ్యారంటీ లేదు కాబ‌ట్టీ). యిలాంటి ప్ర‌వ‌ర్త‌న నాలుగైదుసార్లు రిపీట్ అయ్యాక క‌నీసం ఆ స‌మ‌స్యాత్మ‌క విద్యార్థికి టీసీ యిచ్చి పంపించే అధికారం అయినా హెచ్‌.ఎం. కి వుండాలా వ‌ద్దా?

'ఇదిగోండీ ప‌రిస్థితి యిలా వుంది.. పిల్ల‌ల్ని చ‌క్క‌దిద్ద‌డానికి ఏం చేయాలో అంద‌రం క‌లిసి కూర్చోని ఆలోచిద్దాం..' అని పేరెంట్స్ క‌మిటీ మెంబ‌ర్స్ తో మీటింగ్ పెట్టుకున్న‌ప్పుడు.. ఆ మెంబ‌ర్స్ లో కాస్త నోరున్న పెద్ద‌మ‌నిషి కూడా ఒక పెగ్గేసి మీటింగ్ కి వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి? బ‌ళ్లో జ‌రిగే మీటింగ్‌కి తాగి వ‌చ్చిన కార‌ణం చూపి ఆ మెంబ‌ర్‌ని డిస్‌క్వాలిఫై చేయొచ్చా? అలా చేసిన‌ప్పుడు స‌ద‌రు తాగుబోతు మెంబ‌ర్ యింకో నైంటీ అద‌నంగా వేసి, వొక ప‌దిమంది స‌న్నాసుల‌తో క‌ల‌సి బ‌డికొచ్చి అమ్మ‌నాబూతులు లంకించుకుంటే త‌దుప‌రి క‌ర్త‌వ్యం ఏంటి?

Unfortunately, these are not hypothetical questions.. They do happen dudes..😔

పిల్ల‌ల్ని మంచి మూడ్‌లో వుంచ‌డానికి ఆనంద‌ల‌హ‌రి, ప్ర‌శాంతంగా వుంచ‌డానికి యోగా, ఆత్మ‌ర‌క్ష‌ణకి మార్ష‌ల్ ఆర్ట్సు, వీడియో పాఠాలు, ఆడియో గీతాలు.. తొక్కా తోట‌కూర‌..!! ప్ర‌పంచం శ‌ర‌వేగంగా మారిపోతోంది. మ‌నం చిన్న‌ప్పుడు చూసిన లొల్లాయి రోజులు కావు. అస‌లు స‌మ‌స్య‌లు వ‌దిలేసి భూటాన్‌లో అలా చేశారు, నేపాల్లో యిలా చేశారు అంటూ త‌లాతోకా లేని స్కీముల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి పాఠ‌శాల‌ల్ని వేదిక‌గా చేస్తున్నంత‌కాలం పరిస్థితిలో మార్పు రాదు..

(ప‌డ‌క్కుర్చీలోనుండీ లేచి నాలుగు మాట‌లు చెప్పాల‌నుకునే కామెంట్ల‌కి ఆహ్వానం. రొటీన్ చైల్డ్ సైకాల‌జీ వినిపించేవారికి న‌మ‌స్కారం.. మ‌రీ మ‌న‌సుని గ‌ట్టిగా కుదిపితే త‌ప్ప‌, కామెంట్ల‌కి రిప్లై రాయ‌డం నాకు అల‌వాటు లేదు. గ‌మ‌నించ‌గ‌ల‌రు)

Discussion (0)