2050.. ఎన్నికల ఫలితాలొచ్చాయి.. అందరూ వూహించినట్టుగానే నీయమ్మా పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది.
నిజానికి ఓటింగు జరగడానికి వొక పక్షంరోజుల ముందువరకూ కూడా నీయక్కా పార్టీనే గెలవబోతోందని అనిపించింది. నీయక్కా పార్టీ అధ్యక్షుడైన బొకడారావు ఎలెక్షన్ కమీషన్కి సమర్పించిన అఫిడవిట్లో తనకి గత పదేళ్లుగా డ్రగ్ ట్రాఫికింగ్ తో సంబంధాలున్నాయనీ, తన ఆస్తులన్నీ ఆ విధంగా వచ్చినవేననీ రాయడమే కాకుండా అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాడు. కాదని తోసిపారేయడానికి వీల్లేని విధంగా వున్నాయవి. అలాంటి సమర్థుడే నాయకుడిగా రావాలని అందరూ కోరుకున్నారు. నీయక్కా పార్టీ అధికారంలోకొస్తే తాను ఎవరికి ఏ శాఖ యిచ్చేదీ కూడా బొకడారావు ముందుగానే ప్రకటించాడు.
కానీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి నీయమ్మా పార్టీ అధ్యక్షుడు బోకురావు ఎవరూ వూహించని విధంగా బాంబు పేల్చాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరపడం తన హాబీ అనీ, టీనేజీనుండీ తనకి ఆ బలహీనత వుందనీ వెల్లడించడంతో పాటు, ఏకంగా వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీడియాకి అందజేశాడు. దాంతో గాలి వొక్కసారిగా తిరగబడింది. డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి వుల్ఫా చర్యతో పోల్చుకుంటే, బాలలపై లైంగికనేరాలన్నది మరింత పెద్ద హీరోయిక్ డీడ్ కాబట్టీ తటస్థులంతా వొక్కపెట్టున నీయమ్మాపార్టీ నాయకుడైన బోకురావుకి ఫ్యాన్స్ గా మారిపోయారు. తన మంత్రులంతా జైలునుండీ ఎకాయెకిన వచ్చి నామినేషన్ వేశారనీ, అలాంటి అభ్యర్థులు నీయమ్మా పార్టీకి లేరనీ బొకడారావు గొంతుచించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.. అతని పదవి వూడిపోయింది..
ఈ హఠాత్పరిణామంతో బొకడారావు వర్గం కంగుతింది. అతను స్వయంగా స్థాపించి, నడిపించిన నీయక్కా పార్టీ కార్యకర్తలే అతన్ని చిన్నచూపు చూడడం మొదలెట్టారు. ఆ మాటకొస్తే అసలు బొకడారావుకే తనమీద తనకి అసహ్యం వేసింది బోకురావు నేరచరిత్ర ముందు తన క్రిమినల్ హిస్టరీ సూర్యునిముందు దివిటీలా వెలవెలబోతోందని అతనికి బోధపడింది. అయినా అతను నిబ్బరం కోల్పోలేదు. కేంద్రంలో తనకున్న పలుకుబడిని వుపయోగించి మధ్యంతర ఎన్నికలు తెప్పించడం అతనికి పెద్ద టాస్కేమీ కాదు. కానీ యీలోగా తాను యింకాస్త పెద్ద లఫంగినని ప్రూవ్ చేస్కోవాలి. నిజానికి దానికోసం అతను కొత్తగా చేయాల్సింది కానీ, అబద్దాలాడాల్సింది కానీ లేదు. బోకురావు కన్నా నిజానికి బొకడారావు మరింత నీచుడు. కానీ, తన నీచత్వానికి సంబంధించిన ఆధారాలు భద్రపరుచుకోవాలనే ముందుచూపు అతనికి లేదు.
అందుకే తన ఆంతరంగికులతో వొక కమిటీ వేశాడు. ఇప్పటికిప్పుడు తాను ఎలాంటి నేరాలు చేయడం ద్వారా ప్రజల మన్నననీ, మద్దతునీ పొందగలుగుతాడో ఆలోచించి నెలరోజుల్లోగా నివేదిక అందించమని ఆదేశించాడు. ఈ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా బోకురావు దృష్టికి వచ్చింది. బొకడారావు అజ్ఞానం చూసి అతను పగలబడి నవ్వుకున్నాడు. తన దగ్గరున్న అస్త్రాల్లో ఎన్నికల సందర్భంగా వాడింది వుత్త జుజుబీ అనీ, అసలైంది తానింకా బయటకి తీయనేలేదనీ తెలుసుకోలేని బొకడారావు అమాయకత్వానికి జాలిగా కూడా అనిపించింది..
(సశేషం అయినా సరే ఈ కథ యింతటితో సమాప్తం.. ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలని యిందులో వెతికే ప్రయత్నం చేయకండి. ఈ కథలో మీరు వెతకాల్సింది ఓటర్లని.. ఇంకో ముప్పై ఏళ్లకి రాజకీయాలు, ఎన్నికలు యిలాగే తగలడతాయ్.. అందుకు కారణం నిస్సందేహంగా నాయకులు కాదు.. జనాలే అని చెప్పడానికి రాశాను.. అంతే..!!)
Discussion (0)