1989.. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా.. అసెంబ్లీ ఎలెక్షన్లలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. మా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు దగ్గర్లో వున్న నూజివీడు, మైలవరం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. ఆ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేలకీ మావూళ్లో అభినందన సభ జరిపారు. దానికి ముందు ఒక భారీ వూరేగింపు. చిన్నవూరే అయినా.. మూడు ఏరియాలనుండీ పార్టీవోళ్లు పెద్దయెత్తున రావడం వల్ల ర్యాలీకి ఒక రెండుగంటలు పట్టింది. గూడ్సు రిక్షాలో అమర్చబడిన మైకుముందు నిలబడి.. జోహార్ అమరజీవి ఇందిరాగాంధీ, కోనేరు రంగారావుగారి నాయకత్వం వర్థిల్లాలి, జిందాబాద్ జిందాబాద్ రాజీవ్‌గాంధీ జిందాబాద్.. ఇలా స్లోగన్స్ యిచ్చేవాళ్లలో మెయిన్‌రోల్ నాదే. తప్పుల్లేకుండా ఎక్కువసేపు చెప్పగలిగినవాళ్లలో చాలామంది మందుకొట్టి వుండడం వల్లో, లేక అదొక పనికిమాలిన చాకిరీ అనుకోవడం వల్లో గానీ ఎవరూ నాకు పెద్దగా పోటీ రాలేదు. ఆరోజు రాత్రి బోలెడు కలలు.. రాజీవ్‌గాంధీ నన్ను పిలిచి యువజనకాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించమని అడిగినట్టు, నేను గంభీరంగా చూస్తూ మూడురంగుల కండువాని ఆయన చేతుల మీదుగా తీసుకున్నట్టు.. దేశంకోసం చాలా విలువైన పని వొకటి చేశానన్న సంతృప్తి.
మాది మొదట్నించీ కాంగ్రెస్‌కి బాగా విధేయులుగా వుంటూ వచ్చిన ఫ్యామిలీ. ఆరోజు మానాన్నగారు నన్నేమీ అనలేదు. స్లోగన్స్ యిచ్చిన కుర్రాడు రాజుగారి అబ్బాయంట అనే మాటలు ఆయనకి కించిత్ గర్వాన్ని కూడా కలిగించివుంటాయని నా అనుమానం. ఒక యిరవైనాలుగ్గంటలపాటు నేను రాజీవ్‌గాంధీ, యూత్ కాంగ్రెస్, ఢిల్లీ, కండువా... కలలోనే వున్నాను. నేను ఢిల్లీ వెళుతున్న విషయం తెలిసి నా దోస్తులంతా ఎలా ఫీలవుతారో ఆలోచిస్తున్న కొద్దీ నాకు యింకాయింకా థ్రిల్ పెరుగుతూ పోతోంది. కానీ, వురుము లేని పిడుగులాగా.. ర్యాలీ జరిగినరోజు తెల్లారి సాయంత్రం స్కూలునుండీ యింటికొస్తూనే మా తండ్రిగారు నన్ను తిట్టడానికి తగులుకున్నారు. నువ్వు చేసిన పనికి సిగ్గుతో చితికిపోతున్నా నేను. టీచర్లంతా నవ్వుతున్నారు. "మీవాడు కూడా చివరికి ఆ చంద్రమౌళి మాస్టారి అబ్బాయిలాగా ఎందుకూ పనికిరాకుండా పోతాడు. వాడెంత, వాడి వయసెంత, యిప్పట్నించే పాలిటిక్సు మరిగితే దేనికైనా పనికొస్తాడా" అంటన్నారు.. ఇంకోసారి యిలాంటి పనులు చేశావంటే తోలుతీస్తా. (అప్పట్లో తాటతీయడం అనే పదబంధం యింకా పూర్తి ప్రాచుర్యంలోకి రాలేదు.. గ్రహించగలరు). ఆయన అన్న మాటల్లో నన్ను ఆకర్షించింది వొక్కటే.. చంద్రమౌళి మాస్టారి అబ్బాయి!
ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే.. సదరు చంద్రమౌళి మాస్టారి అబ్బాయి కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల్లో తిరుగుతూ, చివరికి వుజ్జోగం సజ్జోగం లేకుండా పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లిపోయాట్ట. ఆ విషయం తెలిసి నాకు మా నాన్నమీద చాలా కోపం వచ్చింది. నన్ను అతనితో పోల్చడం ఏంటి? ఇవాళో రేపో ఢిల్లీ వెళ్లబోయే నాకు.. ఎక్కడో పల్లెటూళ్లో కూలోళ్లతో కలిసి పాటలు పాడుతూ పదిమందినీ పాతికమందినీ కూచోబెట్టి అర్థం కాని కబుర్లు చెప్పే అతగాడికీ పోలికా? తండ్రీ నిన్నుదలంచి అన్న పద్యం పాడుకోడానికి అవకాశం లేకుండా చేశాడే మా నాన్న..!
కట్ చేస్తే.. ఆ తర్వాత నాలుగైదేళ్లకీ నేనూ సీపీఎం వైపు ఆకర్షితుణ్నయ్యాను. పార్టీలో యాక్టివ్‌గా పనిచేయడంతోపాటు, పార్టీ పత్రిక అయిన ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్‌గా చేశాను కొన్నాళ్లు. ఈరోజు కమ్యూనిస్టు సిద్ధాంతం అవుట్ డేటెడ్ అయిపోవచ్చు. నా కళ్లముందే పార్టీ బలహీనపడిపోయి వుండొచ్చు. పార్టీలో చేరి నాలుగుమాటలు నేర్చుకొని, ఆనక పెట్టుబడిదారీ పార్టీల్లోచేరి నాయకులుగా ఎదిగి, తమజాతి ప్రయోజనాలని తాకట్టు పెట్టిన వేలాదిమంది సాక్షిగా కమ్యూనిస్టు పార్టీలు తమ వునికి పూర్తిగా కోల్పోయి వుండొచ్చు. నేను ఒక సానుభూతిపరుడిగా మాత్రమే మిగిలిపోయివుండొచ్చు. కానీ, ఆ పుస్తకాలు, ఆ మనుషులు, ఆ జీవితం నాకు పరిచయం చేసిన కొత్త ప్రపంచం తాలూకూ ప్రభావం నామీద ఎప్పటికీ అలాగే వుండిపోయింది.
ఒక వున్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, అందులో లోతుపాతులు అర్థమయ్యాక దాన్నుండీ పారిపోతూ, అపరాధభావన లేకుండా వుండడం కోసం ఆ లక్ష్యమే పనికిమాలినదని రాళ్లేసే నాలాంటి వాళ్లమధ్య చంద్రమౌళి మాస్టారి అబ్బాయి మొనగాడే.. మొనగాళ్లకి మొనగాడు. ఢిల్లీ వెళ్లి రాజీవ్‌గాంధీ చేతులమీదుగా కండువా అందుకున్న వాళ్లకంటే కూడా నిస్సందేహంగా..!!
Discussion (0)