Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

న‌టులు.. మంచి న‌టులు.. మ‌హాన‌టులు

Sridhar Bollepalli

న‌ట‌న అంటే ఏంటి అని నేనిప్పుడు అడిగి, దానికి నాకు తోచిన స‌మాధానం ఏదో చెప్ప‌బోయాన‌నుకోండీ.. అది పెద‌రాయుడు సినిమాకి బ్ర‌హ్మానందం చేసిన స్ఫూఫ్ లాగా త‌యార‌వుతుంది. అస‌లు భార్యంటే ఏంట‌నుకున్నావ్‌? భార్యంటే వైఫ్‌.. వైఫంటే ప‌త్నీ.. ఇలాగ‌న్న‌మాట‌.

ఒక న‌టుడు లేదా న‌టి ఏదైనా ఒక పాత్ర చేసేట‌ప్పుడు ఆ పాత్ర‌కి ఎలాంటి ఆహార్యం, భాష‌, హావ‌భావాలు అవ‌స‌ర‌ప‌డాతాయో అంత‌క‌న్నా ఎక్కువా త‌క్కువా కాకుండా చేయగ‌ల‌గి వుండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. మ‌న‌కి ఆ పాత్ర త‌ప్ప న‌టుడు లేదా న‌టి క‌నిపించ‌కూడ‌దు. హాలీవుడ్ సినిమాల్లో (ఇంకా అనేక ఇత‌ర భాషల సినిమాల్లో కూడా. కానీ నాకు వాటి గురించి తెలియ‌దు) ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఫైట్ క్ల‌బ్ సినిమాలో బ్రాడ్ పిట్ కీ, ద క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్‌లో బ్రాడ్ పిట్‌కీ చాలా తేడా వుంటుంది. అలాగే జూలీ అండ్ జూలియాలో మెరీల్ స్ట్రీప్‌కీ, ద డెవిల్ వేర్స్ ప్రాదా లో మెరీల్ స్ట్రీప్ కీ అస‌లు పోలికే వుండ‌దు. మ‌న‌కి అలాక్కాదు. మ‌న చిరంజీవులూ, బాల‌కృష్ణ‌లూ, మ‌హేషులూ, ప్ర‌భాసులూ దాదాపు అన్ని సినిమాల్లో ఒకేలా క‌న‌బ‌డుతూ, ఒకేలా మాట్లాడుతూ, ఒకేలాంటి డ్ర‌స్సులు వేసుకుంటూ వుంటారు. (ఏదో ఒక‌టీ అరా సినిమాలు మిన‌హాయింపు అనుకోండీ). మ‌న దేశంలో ఆర్టు సినిమాలు మిన‌హాయిస్తే మెయిన్ స్ట్రీమ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో కూడా త‌మిళం, మ‌ల‌యాళం వాళ్లు కాస్త రియ‌లిజానికి ద‌గ్గ‌ర‌గా పోతూ వుంటారు. (వాళ్లు కూడా అన్ని సినిమాల్లో కాదు. మోహ‌న్‌లాలు, మ‌మ్మూటీ వున్న సినిమాలు అన్నీ మ‌నం చూడం కాబ‌ట్టీ, వాళ్ల‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంటాం కానీ, వాళ్ల సినిమాల్లో కూడా భ‌యాన‌క‌మైన రాడ్లు వుండి తీర‌తాయి).

ఇక‌పోతే డాన్సులు, ఫైట్లు కూడా న‌ట‌న‌లో భాగ‌మే అనుకునే బుర్ర‌త‌క్కువ‌త‌నం మ‌న‌లో పుష్క‌లంగా వుంది. సర్క‌స్ కి పోతే వాళ్లు చేసే ఫీట్ల క‌న్నా బ‌ఫూన్లు చేసే కామెడీ బావుంటుంది ఒక్కోసారి. అలాగే బుక్ ఫెస్టివ‌ల్ కి పోతే అక్క‌డ పుస్త‌కాల క‌న్నా పునుగులు, బ‌జ్జీలు తిన‌డం వ‌ల్ల ఎక్కువ మందికి గిట్టుబాట‌వుతుంది. సినిమాల్లో పాటలు, ఫైట్లు కూడా అంతే. మా పోస్టుమ్యానుకి ఫ్లూటు వాయించ‌డం బాగా రావ‌డం వ‌ల్ల అత‌ను మంచి పోస్టుమ్యాన్ అని కితాబివ్వ‌డం ఎలాంటిదో.. డాన్సులు, ఫైట్లు ఆధారంగా హీరో (అస‌లు హీరో అన‌డ‌మే క‌రెక్ట్ కాదు. క్లారిటీ కోసం ఆ మాట వాడుతున్నా) ఎంత తోపూ అన్న‌ది డిసైడ్ చేయ‌డం క‌రెక్ట్ కానే కాదు. కానీ, ఒక మూస‌కి అల‌వాటు ప‌డిపోయాం కాబ‌ట్టీ.. వాటిని కూడా న‌ట‌న‌లో భాగంగా చూడ‌డానికి అల‌వాటు ప‌డిపోయాం మ‌నం.

మిస్స‌మ్మ‌లో ఎన్టీయార్ ని చూస్తుంటే ఆ పాత్ర కోస‌మే పుట్టిన‌ట్టు వుంటాడు. అలాగే గుండ‌మ్మ‌క‌థ‌లో కూడా. ఆ త‌ర్వాత వ‌చ్చిన రంగుల సినిమాల్లో రామారావు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఎన్టీయార్ చేసిన పౌరాణికం సినిమాలు కూడా నాకు బాగా న‌చ్చుతాయి. కానీ, పాత్రౌచిత్యం గురించి లెక్క‌లేయ‌డానికి ఆ సినిమాలు ఉప‌క‌రించ‌వు. ఎందుకంటే, అస‌లు ఆ రాజులు కానీ, దేవుళ్లు కానీ (దేవుళ్లు వుండుంటే సంగ‌తి) మ‌న‌కి తెలీదుగా? సో, స‌హ‌జంగా చేశాడూ అన‌లేం అక్క‌డ‌. ఆక‌ట్టుకునేలా చేశాడూ అని మాత్ర‌మే అన‌గ‌లం. ఏయ‌న్నార్ విష‌యానికొస్తే.. ఆయ‌న ఎన్టీయార్ చేసిన‌న్ని అద్భుతాలూ చేయ‌లేదూ, చివ‌రికొచ్చేస‌రికి ఎన్టీయార్ చేసినంత అతీ చేయ‌లేదు అనిపిస్తుంది నాకు (ప్యూర్లీ ప‌ర్స‌న‌ల్ ఒపీనియ‌న్‌. ఎనీ వ‌న్ హూ డ‌జంట్ ఎక్స్ పెక్ట్ రిప్లై కెన్ కాంట్ర‌డిక్ట్ మై ఒపీనియ‌న్‌). ఎన్టీయార్ త‌ర్వాత నేనే అని మోహ‌న్‌బాబు అంటూ వుంటాడు. అస‌లు ఎన్టీయార్ రెండో సగంలోని సాంఘిక సినిమాలే పెద్ద హింస‌. ఇక మోహ‌న్‌బాబు అతి మొనాట‌నీ ఎన్టీయ‌ర్ తాలూకూ ఏ ద‌శ లెగ‌సీని క్యారీ చేస్తుందో నాకు తెలీదు. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన రౌడీ సినిమా, ఇంకా అలాంటి నాలుగైదు సినిమాల్లోనే మోహ‌న్‌బాబు కాస్త న‌టుడిగా క‌నిపించ‌చేది.

నాకు చిరంజీవి అంటే ఇష్టం అన‌గానే చాలామందికి న‌వ్వులాట‌గా వుంటుంది. అలాగే బాల‌కృష్ణ గురించి మాట్లాడితే ఇంకొంద‌రికి న‌వ్వులాట‌గా వుంటుంది. న‌ట‌న అనే ప‌దానికున్న యూనివ‌ర్స‌ల్ డెఫినిష‌న్ వ‌దిలేసి.. మ‌న ఇండియ‌నైజ్డ్ నిర్వ‌చ‌నం ఏదో మ‌నం ఇచ్చుకున్నాక ఇక ఆయా న‌టులు గొప్ప న‌టులు, లేదా మ‌హాన‌టుల కోవ‌లోకి వ‌స్తారా రారా అని చ‌ర్చించుకోవ‌డం రిడిక్యుల‌స్‌. డ‌బ్బులు బాగా రాబ‌ట్ట‌గ‌లిగే న‌టులు, జ‌న‌రంజ‌క న‌టులు, ఈ రెండు ప‌నులూ అంతంత మాత్రంగా చేయ‌గ‌లిగిన న‌టులు, అస్స‌లు చేయ‌లేని న‌టులు మాత్రం వుంటారు. ఇందులో మంచీ చెడూ అనేవి వుండ‌వు. ఆ ర‌కంగా చూసిన‌ప్పుడు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్, మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీయార్‌, రామ్ చ‌ర‌ణ్‌, (ఫాలోయింగ్ ప‌రంగా చూస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా) వీళ్ల‌ని పెద్ద న‌టులుగా చెప్పుకోవాలి. మ‌ళ్లీ వీళ్లు వ్య‌క్తులుగా ఎలాంటివాళ్లు, వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాలు ఎలాంటివి అన్న‌ది ప‌రిగ‌ణ‌ణ‌లోకి తీసుకోకూడ‌దు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ పెట్టాడ‌నీ, బాలకృష్ణ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ న‌డుపుతున్నాడ‌నీ, ఫ‌లానాయ‌న వ‌ర‌ద బాధితుల‌కి స‌హాయం చేశాడ‌నీ, ఇంకొకాయ‌న మేక్ ఎ విష్ కింద అనాథాశ్ర‌మానికి పోయాడ‌నీ.. వీట‌న్నిటిప‌ట్లా మ‌న‌కి మురిపెం వుండొచ్చు. కానీ, వాటి ఆధారంగా న‌టి లేదా న‌టుడి స్థాయిని డిసైడ్ చేయ‌కూడ‌దు.

ఈ సోకాల్డ్ పెద్ద న‌టులు చేసే అతికీ, మొనాట‌నీకీ అల‌వాటు ప‌డిపోయాక కూడా కొంత‌మంది సినిమాలు చూస్తుంటే వాళ్ల అభిమానుల‌కి త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రికీ జీవితం మీద విర‌క్తి పుట్టించే సంద‌ర్భాలొస్తాయి. మ‌రీ పేల‌వంగానో, అతిగానో చేయ‌డం వ‌ల్ల స‌న్నివేశంలో పండాల్సిన ర‌సం సంగ‌తి దేవుడెరుగు, ముందు మ‌న‌కి పులుసు కారిపోద్ది. అస‌లు ఇంకొక ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. హిట్ సినిమానా, ఫ్లాప్ సినిమానా అన్న‌దానితో సంబంధం లేకుండా ఫ‌లానా ఆర్టిస్టులో మేట‌ర్ వుందా లేదా (మ‌నం డిఫైన్ చేసుకున్న నేరో వేరియంట్ ప్ర‌కార‌మే) అన్న‌ది తెలిసిపోతూ వుంటుంది. ఈ పెద్ద హీరో ఫ‌లానా ఐదు సినిమాలో చించేశాడు. ఫ‌లానా ప‌ది సినిమాల్లో బొక్క‌బోర్లా ప‌డ్డాడు అంటే దానిక‌న్నా కామెడీ ఇంకొక‌టి వుండ‌దు. క‌థ‌, క‌థ‌నం, సంభాష‌ణ‌లు, సాంకేతిక స‌హ‌కారం ఇత్యాదుల్లో లోపాలు వుండొచ్చు కానీ, బేసిగ్గా ఆ న‌టుడు ఒక హిట్ సినిమాలో ఎంత బాగా చేశాడో, ఫ్లాప్ సినిమాలో కూడా అంతే బాగా చేసుండాలి.

క‌మ‌ర్షియ‌ల్లీ బిగ్ హీరోస్ తో ఎలాంటి స‌మ‌స్య‌లుంటాయ‌ని చెప్పానో ఆ స‌మ‌స్య‌లన్నీ నాకు చిరంజీవితో కూడా వుంటాయి. చిరంజీవి సినిమాల్లో కొన్ని న‌చ్చుతాయి, కొన్ని న‌చ్చ‌వు. ఠాగూర్ త‌ర్వాత చిరంజీవి చేసిన‌ అస‌లు ఏ సినిమా నాకంత ఎక్క‌లేదు. ఆచార్య బావుంటుందేమో అని ఆశ‌గా ఎదురుచూస్తున్నా. ఆఫ్ బీట్ సినిమాలూ, పార‌లల్ సినిమాలూ, ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాలూ ఎన్ని చూసినా.. ఇంకా ఇంట‌ర్మీడియ‌ట్లో వొంట‌బ‌ట్టిన క‌మ‌ర్షియ‌ల్ సినిమాల పిచ్చి మాత్రం ఇంకా ప‌చ్చ‌గా, ప‌చ్చిగా నా మ‌ష్కిష్కంలో వేళ్లూనుకోని వుండిపోయింది. అలాగే చిరంజీవి పిచ్చి కూడా. చిరంజీవి కంటే ఒక సినిమాలో నానీ, ఒక సినిమాలో ధ‌నుష్‌, ఒక సినిమాలో ఇంకొక‌ళ్లు బాగా చేసుండొచ్చు. కానీ, నాకు చిరంజీవి చూస్తేనే సంతోషం. అలాగే మీకు వెంకటేష్‌నీ, నాగార్జున‌నీ, బాల‌కృష్ణ‌నీ చూస్తే సంతోషంగా వుండొచ్చు. మ‌న ఫేవ‌రెట్ హీరోకి హిట్ వ‌చ్చిన‌ప్పుడు ఆ సంతోషం ద్విగుణీకృతం అవ్వొచ్చు. త‌ప్పు లేదు. మ‌నుషుల‌కిది స‌హజం. కానీ, మ‌న అభిమాన న‌టుడు కార‌ణ‌జ‌న్ముడయిన‌ట్టు మాట్లాడినా, ఆ ప‌ర‌మార్థాన్ని అవ‌గ‌తం చేసుకోలేనివాళ్లు బుర్ర‌త‌క్కువోళ్ల‌న్న‌ట్టు మాట్లాడినా అది మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ కోటాలోకి వ‌చ్చేస్త‌ది. అస‌లు క‌మ‌ర్షియ‌ల్ సినిమా హీరోల్లో స‌హ‌జ‌న‌ట‌న‌నీ, మంచి న‌ట‌న‌నీ వెత‌క‌డ‌మే బుర్ర‌త‌క్కువ‌త‌నం. నాకు వీడంటే గుల‌. నీకు వాడంటే గుల‌. ఇటీజ్ యాజ్ సింపుల్ యాజ్ ద‌ట్‌.

నా అభిప్రాయాలు గెజిట్ లో ప్ర‌చురించి, రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేయ‌రు. మీరు డిఫ‌ర్ అవ్వొచ్చు. అస‌లు నా ఆలోచ‌న అంతా త‌ప్పుల‌త‌డ‌క అయ్యుండొచ్చు. నాకు జ్ఞాన‌బ‌ల్బు వెల‌గ‌డానికి ఇంకా టైం ప‌ట్టొచ్చు. ఈరోజుకి నా బుర్ర‌లో వున్న‌దిది.

Discussion (0)