Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

జ‌గ‌న్ గారూ.. ఫ్యాన్స్ తో జాగ్ర‌త్త‌

Sridhar Bollepalli

పొలిటిక‌ల్ పోస్టులు రాయొద్దురా అయ్యా, ఆ పెంట మ‌న‌కొద్దు అని ప‌దే ప‌దే నాకు నేను న‌చ్చ‌జెప్పుకుంటూ వుంటాను. నీతినీ, న్యాయాన్నీ, ధ‌ర్మాన్నీ నిల‌బెట్టాల్సిన బాధ్య‌త నా మీద లేద‌ని నేను న‌మ్మ‌డం ఒక కార‌ణం అయితే.. అస‌లు జ‌నాలు విలువ‌లు అని న‌మ్మే చాలావాటి ప‌ట్ల నాకు ఏమాత్రం సింప‌థీ లేకపోవ‌డం వ‌ల్లా, ఏవైతే స‌మాజ విలువ‌లుగా ప‌రిగ‌ణింప‌బ‌డుతున్నాయో వాటిలో చాలావ‌ర‌కూ నేను వ్య‌క్తిగ‌త జీవితంలో పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లా.. అస‌లు నాకు రాజ‌కీయాల గురించి వ్యాఖ్యానించే అర్హ‌త లేదు అనుకుంటూ వుంటాను. అయినా స‌రే.. టిమ‌టిమ ఆగ‌డం లేదు కాబ‌ట్టీ, ఈరోజు వొక రెండు మాట‌లు.

(మామూలుగా మాట్లాడుకునేట‌ప్పుడు చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, చిరంజీవి, మోడీ.. మొద‌లైన పేర్ల చివ‌ర గారూ అని చేర్చం కాబ‌ట్టీ ఏక‌వ‌చ‌నంతోనే వాడుతున్నాను. వ్యావ‌హారిక భాష‌ని వాడే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప ఆయా వ్య‌క్తుల‌ని కించ‌ప‌ర‌చాల‌నే వుద్దేశం కాద‌ని గ‌మ‌నించ‌గ‌ల‌రు).

చంద్ర‌బాబు సీఎం గా వున్న‌ప్పుడు నేనొక పోస్టు రాశాను. అస‌లు జ‌గ‌న్ మీద వున్న కేసులెన్ని, వాటిలో ఎఫైఆర్ దాఖ‌లైన‌వెన్ని, చివ‌రికి నిలిచేవెన్ని అనేది చాలామంది జ‌నాల‌కి తెలియ‌దు. ల‌క్ష‌కోట్ల అవినీతి జ‌రిగింద‌నీ, ఆ డ‌బ్బుల‌న్నీ జ‌గ‌న్ ఖాతాలోనే ప‌డ్డాయ‌నీ టీడీపీ వాళ్లు న‌మ్ముతారు. అస‌లు అవినీతి జ‌ర‌గ‌నేలేద‌నీ, వొక‌వేళ జ‌రిగివున్నా అది అవ‌స‌ర‌మేన‌నీ, స‌హ‌జ‌మేన‌నీ, దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌నీ వైసీపీవాళ్లు న‌మ్ముతారు. ఇందులో నిజానిజాలేంటీ అన్న‌ది తేల్చాల్సింది కోర్టులు. అసెంబ్లీలో జ‌గ‌న్ మాట్లాడ్డం మొద‌లెట్ట‌గానే దొంగ‌బ్బాయ్ అనీ, ఫోర్ ట్వంటీ అని కేక‌లు పెడుతూ, అత‌న్ని మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డం హేయం అని ఆ పోస్టు సారాంశం. ఆ పోస్టుకి ఎలాంటి స్పంద‌న వ‌చ్చిందో నేను మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టీడీపీ వాళ్లంతా అమ్మ‌నాబూతులు తిట్టారు. వైసీపీ వాళ్లంతా ఆకాశానికెత్తారు.

టీడీపీవాళ్లు వైసీపీవాళ్ల‌ని తిట్టినా, వైసీపీవాళ్లు టీడీపీ వాళ్ల‌ని తిట్టినా అది త‌ప్పే. రాజ‌కీయ ల‌బ్దికోసం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కి దిగ‌డం, అందుకోసం అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడ‌డం నీచం. ఈ త‌ప్పు ఎప్ప‌టినుండో ఎంతోకొంత మోతాదులో జ‌రుగుతూనే వుంది. సంస్కారం, హుందాత‌నం, విష‌య‌ప‌రిజ్ఞానం వున్న‌వాళ్ల‌ని కాకుండా వీధిరౌడీల్లా ప్ర‌వ‌ర్తించేవాళ్ల‌ని నాయ‌కులుగా ట్రీట్ చేసే బుర్ర‌త‌క్కువ జనాలు పుష్క‌లంగా వున్న స‌మాజంలో యింత‌క‌న్నా మంచి నాయ‌కుల‌ని ఆశించ‌లేం. కాస్త వివేకం, సంయ‌మ‌నం వున్న‌నాయ‌కులు కూడా కాస్త ప‌ద్ధ‌తిగా వుంటే వెన‌క‌బ‌డిపోతామేమో అనే భ‌యంతో అల‌వాటు లేని భాష‌నీ, బాడీ లాంగ్వేజీనీ క‌ష్ట‌ప‌డి నేర్చుకొని మ‌రీ దిగ‌జారాల్సిన దుస్థితి దాపురించింది. దీనికి బాధ్య‌త వ‌హించాల్సింది ప్ర‌జ‌లే.

చంద్ర‌బాబు సీఎంగా చేసిన అనేక ప‌నుల ప‌ట్ల నాకు అసంతృప్తి వుంది. ఐదేళ్ల త‌ర్వాత టీడీపీ అధికారంలోకి రాక‌పోతే అమ‌రావ‌తిని న‌మ్ముకున్న వాళ్ల‌కి ఏం గ‌తి ప‌డుతుంది అనే ఆలోచ‌న లేకుండా, అన‌వ‌స‌ర‌పు ప‌గ‌టిక‌ల‌ల‌తో కాల‌యాప‌న చేసి మా నెత్తిన మ‌ట్టి కొట్టినందుకు ఆయ‌నంటే కోపం నాకు. మా వూరికి కూత‌వేటు దూరంలో వుండాల్సిన రాజ‌ధాని అస‌లెక్క‌డికి పోయిందో కూడా తెలీని ప‌రిస్థితి రావ‌డానికి బాధ్య‌త వ‌హించాల్సింది చంద్ర‌బాబే అని నా వుద్దేశం. 2014 లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యుండి, ఆయ‌న అమ‌రావ‌తిని రాజ‌ధానిగా డిసైడ్ చేసుంటే... 2019 లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక ఏం చేసుండేవాడు? రాజ‌ధానిని అమ‌రావ‌తిలో పీకేసి, యింకెక్క‌డికో ప‌ట్టుకుపోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసి వుండేవాడు. అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో సాగ‌తీత‌ని ప్ర‌ద‌ర్శించ‌డం చంద్ర‌బాబు త‌ప్పు. ఐదేళ్ల‌పాటు ఒక ప్రాంతం రాజ‌ధానిగా చ‌లామ‌ణీ అయ్యాక కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అక్క‌డ నుండీ దుకాణం పీకేయ‌డం జ‌గ‌న్ చేసిన త‌ప్పు. ఇదే విష‌యం నేను గ‌తంలో కూడా పోస్టు పెట్టి, మిత్రుల‌తో దొబ్బులు తిన్నాన‌నుకోండీ అది వేరే విష‌యం.

టీడీపీ హ‌యాంలో పంతుళ్ల‌కి రావాల్సిన డీయేలు స‌కాలంలో రాక‌పోవ‌డం, అయిందానికీ కానిదానికీ ర్యాలీలు పెట్టి, పిల్ల‌ల్నేసుకోని ఎండ‌లో రోడ్ల‌మీద తిర‌గాల్సి రావ‌డం కూడా చికాకుగా వుండేది. టీడీపీ అధికారం కోల్పోయి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ప‌ట్ల నాకేమీ బాధ క‌ల‌గ‌లేదు. క‌ష్టం, స‌మ‌య‌స్ఫూర్తి, ప్రాప్త‌కాల‌జ్ఞ‌త‌, అదృష్టం.. యిలా అనేక విష‌యాలు గెలుపోట‌ముల‌ని నిర్ణ‌యిస్తాయి. ఈసారి జ‌గ‌న్‌కి అవ‌కాశం వ‌చ్చింది, చూద్దాం మార్పు మంచిదేగా?! అనుకున్నాన్నేను. బ‌హిరంగ స‌భ‌ల్లో అభిమానుల‌ని అల‌రించ‌డానికి నాట‌కీయ ఫ‌క్కీలో మాట్లాడే జ‌గ‌న్ న్యూస్ ఛానెల్స్ కి యిచ్చే ఇంట‌ర్వ్యూల్లో మాత్రం చాలా మెచూరిటీతో, బాలెన్స్డ్ గా మాట్టాడ్డం చూసి ముచ్చ‌ట‌ప‌డ్డాన్నేను. ఇంత చిన్న వ‌య‌సులో అంత పెద్ద ల‌క్ష్యం పెట్టుకొని, ర‌క‌ర‌కాల వొత్తిడుల మ‌ధ్య కూడా చిరున‌వ్వు చెర‌గ‌కుండా భ‌లే మేనేజ్ చేస్తున్నాడే అనిపించేది. కానీ, సీఎం అయ్యాక జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి నాకు అంత‌గా రుచించ‌లేదు.

అర‌వింద్ కేజ్రీవాల్ లాగా రాజ‌కీయాల్లో వొక కొత్త శ‌కానికి నాంది ప‌లికే అవ‌కాశాన్ని జ‌గ‌న్ పోగొట్టుకున్నాడ‌నీ, రొటీన్ రాజ‌కీయ రొచ్చులోనే మునిగిపోయాడ‌నీ నాకు అనిపించింది. పాల‌నా వ్య‌వ‌హారాల‌కి సంబంధించి ప్ర‌భుత్వానికి వుండే ప‌రిమితులు, యిబ్బందులు నాకు తెలియ‌వు. కానీ, సంక్షేమ ప‌థ‌కాల కోసం వెచ్చిస్తున్న సొమ్ము అప‌రిమితంగా వుండ‌డం వ‌ల్ల రాష్ట్రం వెన‌క్కి న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే, అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి, కేవ‌లం సంక్షేమాన్నే న‌మ్ముకోవ‌డం అనే రాజ‌కీయ వ్యూహం వ‌ల్ల కొంత ఉప‌యోగం కూడా జ‌రిగిందేమో. క‌రోనా స‌మ‌యంలో జ‌గ‌న్ పంచిన డ‌బ్బుల కార‌ణంగానే చాలామంది ఆక‌లిచావులు త‌ప్పించుకొని బ‌తికి బ‌ట్ట‌గ‌ట్ట‌గ‌లిగారు అనే ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ గారి అభిప్రాయంతో నేనూ ఏకీభ‌విస్తాను. మ‌నుషుల ప్రాణాల కంటే అభివృద్ధి ముఖ్యం కాదు, కాబ‌ట్టీ ఆర్థిక వ్య‌వ‌హారాల‌కి సంబంధించి తెలిసీతెలియ‌ని త‌నంతో మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు అని అస‌లు దానిగురించి ఆలోచించ‌డం మానేశాను.

కానీ, న‌న్ను అమితంగా ఇబ్బంది పెడుతున్న‌దీ, క‌రోనా కాలంతో జ‌నాల్ని బ‌తికించాడ‌న్న కృత‌జ్ఞ‌త‌ని జ‌గ‌న్ ప‌ట్ల క‌న‌బ‌ర‌చ‌కుండా అడ్డం ప‌డుతున్న‌దీ ఏంటంటే... కొంద‌రు వైసీపీ నాయ‌కుల భాష‌, వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ (ఇంకా చాలామంది వున్నారు కానీ, వీళ్లే ప్ర‌ముఖులు) వాడుతున్న భాష వింటుంటే కంప‌రంతో వొళ్లు గ‌గుర్పొడుస్తుంది. పెద్దాయ‌న‌, ముస‌లాయ‌న‌, 40 అనుభ‌వం వున్నాయ‌న‌.. యివ‌న్నీ ప‌క్క‌న పెట్టండి. అస‌లు ఎవ‌రి గురించైనా ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ని మాట‌లు అవి. ప‌ట్టాభి మాట్లాడింది క‌రెక్టుగా వుందా అంటే.. లేదు! పట్టాభి కూడా వీళ్ల కోవ‌లోకి వ‌చ్చే చ‌వ‌క‌బారు మ‌నిషే. కానీ, పై యిద్ద‌రితో పోలిస్తే ప‌ట్టాభి జుజుబీ. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయకుడిగా వున్న‌ప్పుడు టీడీపీ అత‌నిప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు దుర్మార్గంగానే వుంది. కానీ, ఇప్పుడున్నంత దుర్మార్గంగా లేదు. మొద‌లెట్టింది టీడీపీ వాళ్లేగా అంటే.. అవును! మొద‌లెట్టింది టీడీపీ వాళ్ళే. కానీ దానిని ఇప్పుడు వైసీపీవాళ్లు భ‌రించ‌లేని దుర్గంధంగా మార్చేస్తున్నారు. రోజురోజుకీ ఈ పెంట భ‌రించ‌లేనిదిగా త‌యార‌వుతోంది. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఫ‌లానా ఆయ‌న ఆరోజు జ‌గ‌న్ కుటుంబాన్ని దూషించాడుగా? అవును, దూషించాడు. ఆరోజు జ‌రిగింది కూడా పెంట వ్య‌వ‌హార‌మే. కానీ, యింకా ఈ ద‌రిద్రం ఎన్నాళ్లు మాకు? ఒక‌ప్పుడు టీడీపీ చేసిన త‌ప్పుల‌ని సాకుగా చూపిస్తూ, అవే త‌ప్పుల‌ని వంద‌రెట్లు ఎక్కువ అత్యుత్సాహంతో చేస్తూ పోతుంటే.. దీనికి ముగింపు ఎప్పుడు? ఇంకో రెండేళ్ల‌కో, ఏడేళ్ల‌కో టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. అప్పుడు వాళ్లు మ‌ళ్లీ యివే త‌ప్పులు వెయ్యిరెట్లు ఎక్కువగా చేయాలా? ఇంత ద‌రిద్ర‌పు రాజ‌కీయాలు దేశంలో ఎక్క‌డైనా న‌డుస్తున్నాయా అస‌లు?

అయ్యా, అమ్మా.. వైసీపీ స‌పోర్ట‌రులారా..! కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ లాంటి వాళ్లు మాట్లాడే మాట‌ల్ని మీరు వెన‌కేసుకొచ్చి జేజేలు కొట్టినంత‌కాలం వాళ్లు అలాగే వుంటారు, అలాగే మాట్లాడ‌తారు. వాళ్ల బొంగేం పోయింది. కానీ, మీ అంద‌రి చ‌ప్ప‌ట్లు, భ‌జ‌న‌లు చూసి, పిచ్చి రాజ‌కీయాల‌కి అల‌వాటు ప‌డిపోయి, ఇదే గొప్ప ఘ‌న‌కార్యం అనుకుంటుంటే.. చివ‌రికి చ‌రిత్ర‌లో జ‌గ‌న్ స్థానం ఏమిట‌ని చెప్పుకుంటాయి భ‌విష్య‌త్ త‌రాలు? ఇదిగో రామారావు టైంలో యిది జ‌రిగింది, చంద్ర‌బాబు టైంలో యిది జ‌రిగింది, వైయ‌స్సార్ టైంలో యిది జ‌రిగింది అని చెప్పుకున్న‌ట్టు... జ‌గ‌న్ టైంలో జ‌రిగింది ఏంటీ అంటే చెప్పుకోడానికి కొన్ని మంచి మార్పులు, సంస్క‌ర‌ణ‌లు వుండాలిగా? జ‌గ‌న్ ని ఆ పని చేయ‌నివ్వ‌రా? మీ ఆహా ఓహోల మ‌త్తులో ప‌డి.. ఘాటైన బూతులు మాట్లాడేవాళ్లంద‌రినీ చుట్టూతా పెట్టుకొని, స‌మ‌ర్థ‌త వున్న నిజాయితీ ప‌రుల‌ని దూరంగా పెడితే దానికి మూల్యం ఎవ‌రు చెల్లిస్తారు? టీడీపీనో.. యింకొక‌టో యింకొక‌టో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ వాళ్లు బూతుల దండ‌కం చ‌దువుతుంటే మీరంతా వెళ్లి అడ్డం ప‌డ‌తారా? మీ మాన‌న మీ ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటారు. అంతేగా? ఇప్పుడు జ‌రుగుతున్న తంతు మీకు స‌మ్మ‌గా వుందీ అంటే దాన‌ర్థం ఏంటి? చంద్ర‌బాబు టైంలో జ‌రిగింది కూడా మంచే అయ్యుండాలి, లేదా పెంట‌ని మాత్ర‌మే ఆస్వాదించే అభిరుచి అయినా మీకు వుండివుండాలి.

రాష్ట్రంలో ఎలాగూ ప్ర‌తిప‌క్షం స‌తికిల‌ప‌డింది. నోరెత్తేవాడెవ‌డూ లేడు. అయినా స‌రే, జ‌గ‌న్ అత్యంత అప్ర‌మ‌త్తంగా వుండి తీరాలి. ఎందుకంటే, అభిమానుల రూపంలో జ‌గ‌న్ కి ల‌క్ష‌లాదిమంది శ‌త్రువులున్నారు. జ‌గ‌న్ ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించ‌కుండా చేయ‌గ‌లిగే సత్తా ఈ దుర‌భిమాన గ‌ణానికి పుష్క‌లంగా వుంది.

PS:
చెత్త కామెంట్లు తొలగించబడును. కామెంట్లకి రిప్లై ఇవ్వబడదు.

Discussion (0)