ఏకలింగానికి యమర్జంటుగా కళాపోషకుడన్న గుర్తింపు తెచ్చేసుకోవాలని ఆత్రం మొదలయ్యింది. ఈ మధ్యకాలంలో వార్తల్లోకెక్కిన వాళ్లలో ఎవరికైనా సన్మానం చేయడమే అందుకు మార్గమని భావించి, ఆ విషయాన్నే తన స్నేహితుడైన గోపాలం దగ్గర ప్రస్తావించాడు.
"నీ ఆలోచన భేషుగ్గా వుంది. ఎవరో దేనికి మన కాలనీలోనే సన్మానానికి అర్హుడైన ఒక మహారచయిత వున్నాడు" అన్నాడు గోపాలం.
మహా రచయితలు అంటే యుగానికొక్కళ్లే వుంటారేమో అనే అపోహలో వుండిపోయినందుకు సిగ్గుపడుతూ "ఇంతకీ ఎవరా మర (మహా రచయిత)" అని అడిగాడు ఏకలింగం.
"మా ఎదురింట్లో వుండే సుబ్బారావు గారే. ఆయనీమధ్య 'హిందువు కానివాడిని బంధువుగా భావించే హిందువులకి నేను బంధువునెట్లయిత' అనే పుస్తకం రాశాడు. అది మన కాలనీలో వరల్డ్ ఫేమస్ అయిన విషయం నీకు తెలీదా" నిర్ఘాంతపోతూ వెల్లడించాడు గోపాలం.
అసలే సిగ్గిల్లివున్న ఏకలింగం మరింత మ్రాన్పడిపోయాడు.
సమాచారమాంద్యపీడితుడైన స్నేహితుణ్ణి చూసి జాలిపడిన గోపాలం "మరేం పర్లేదులేవోయ్. ఆ మాటకొస్తే సుబ్బారావుగారి పుస్తకం గురించి వాళ్లావిడకి ఇప్పటికీ తెలియదు. నువ్వింకా చాలా బెటర్" అన్నాడు.
ఈ విషయం ఏకలింగాన్ని అంతగా ఆందోళనకి లోను చేయలేదు. పోస్టల్ స్టాంపులకోసం భార్యని డబ్బులడగడానికి భయపడి ఆగిపోయిన కారణంగా పులిట్జర్ బహుమతి పొందే అవకాశాన్ని పుసుక్కున పోగొట్టుకున్న కుయ్కుయ్ముయ్ అనే కొరియా రచయిత గురించి ఒరియా దినపత్రికల్లో వచ్చిన కథనం గురించి వినివున్నాడు ఏకలింగం.
"ఇంతకీ అసలు విషయం చెప్పావు కాదు. ఒట్టి సన్మానమేనా? ఏవైనా బిరుదులూ గట్రా ఇచ్చే వుద్దేశం వుందా?" అడిగాడు గోపాలం.
"అబ్బో లేకేం! మన సుబ్బారావుగారికి మహామరమర అనే బిరుదు ఇద్దామని ఎప్పుడో ఫిక్సయిపోయాను" అంటూ నవ్వాడు ఏకలింగం.
"మహామరమరా? అదేం బిరుదు" అయోమయంగా అడిగాడు గోపాలం. గోపాలానికి అర్థం కాని విషయం వొకటి తనకి తెలిసివుండడం ఏకలింగానికి కించిత్ గర్వమనిపించింది.
"అదేనోయ్ మహా మహా రచయితల్లోకెల్లా మహా రచయిత అని నా వుద్దేశం" గంభీరంగా చెప్పాడు. ఆ బిరుదు కాకుండా మరో బిరుదు యివ్వాలన్న ఆలోచన రావడం మహాపాపం అయినట్టూ, గోపాలనికి అది అర్థం కాకపోవడం అవివేకం అయినట్టూ తల పంకించడం మర్చిపోలేదు ఏకలింగం.
మహామరమర అనే మాటని నాలుగైదుసార్లు స్వగతంలా పలికిన గోపాలం "గమనించావుటోయ్ మహామరమర అనే మాటలో హరహరమహదేవ అనే శబ్దం వున్నట్టు తోస్తోంది నాకు" అన్నాడు.
ఏకలింగానికి కూడా అందులో నిజం వుందనే అనిపించింది. అది తనకి కాకుండా గోపాలానికి తట్టడం చిన్నతనంగా తోచింది కూడా. అందుకే, బయటపడకుండా "అది గ్రహించకుండానే ఆ బిరుదు యివ్వాలనే నిర్ణయానికి వచ్చాననుకున్నావా?" అంటూ ముసిముసిగా నవ్వాడు.
అంతలోకి, గోపాలం ఫోన్ మోగింది. 'డిక్కీ డిక్కీ డీడిక్కి.. డప్పులు వాయించెయ్ నక్కి..' రింగ్టోన్లో వినిపిస్తున్న పాటని కాసేపు ఆస్వాదించిన గోపాలం తప్పదన్నట్టు ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలివైపు మాట్లాడుతున్నది ఎవరోగానీ, వింటున్న గోపాలం మొహం వివర్ణమవుతోంది.
ఏకలింగం కంగారుపడ్డాడు. కొంపతీసి 'ద్రవ్యోల్బణం అదుపుకి చేపట్టాల్సిన చర్యలు' అనే విషయం మీద నందమూరి బాలకృష్ణ ఉపన్యాసాన్ని జియోలో ఫ్రీగా వినిపిస్తున్నారా? లేకపోతే, పిల్లాడి దగ్గర పాడడానికి కాగితం మీద రాసుకున్న రష్యన్ జోలపాటని కంగారులో పవన్కళ్యాణ్ బహిరంగసభలో చదువుతున్నాడా? అనే అనుమానం ముప్పిరిగొన్నవాడై భయంభయంగా కొంచెం దూరం జరిగాడు ఏకలింగం.
రెండు నిముషాల తర్వాత గోపాలం ఫోన్ పెట్టేసి, వుద్వేగంతో యిలా చెప్పాడు, "నువ్వు నీ ప్రాజెక్టుని కొన్నాళ్లపాటు వాయిదా వేయడం మంచిదేమో. సుబ్బారావుగారికి పోటీగా మా పక్కింటి అప్పారావుగారు రాసిన 'బంధువులకి హిందువైనవాడు హిందువులకి బంధువు గానప్పుడు... హిందువులకి బంధువైనవాడు బంధువులకి హిందువెట్లయితడు' అనే పుస్తకం మన కాలనీలో యూనివర్సల్ ఫేమస్ అయిపోయే అవకాశాలున్నాయని బ్రేకింగ్ న్యూస్."
బైద్యనాథ్వారి బ్రాహ్మీవిటా వాడందే అప్పారావుగారి పుస్తకం పేరు గుర్తుంచుకోవడం జరిగేపని కాదని అర్థమైన ఏకలింగం భారంగా అక్కణ్ణించీ కదిలాడు.
Discussion (0)