Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for హీరోచిత సామాగ్రి మరియూ ఇతరములు

హీరోచిత సామాగ్రి మరియూ ఇతరములు

Sridhar Bollepalli

నేను పిల్ల‌కాయ‌గా వున్న రోజుల్లో ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోగారి పాత్ర తాలూకూ వృత్తినే నేనూ స్వీక‌రించాల్సిన అవ‌స‌రం వుంద‌నిన్నీ, ఆ ప‌విత్ర‌కార్య నిర్వ‌హ‌ణ కోస‌మే నేను భూలోకానికి అరుదెంచాన‌నిన్నీ ద్విక‌ర‌ణ‌శుద్ధిగా (క‌ర్మ లేదు కాబ‌ట్టీ) భావించేవాడిని. అప్ప‌ట్లో నేను బుర్ర‌త‌క్కువ‌త‌నాన్ని మిక్కుటంగా క‌లిగివుండేవాడిని అని చెప్ప‌డానికి ఆధార‌భూతంగా నిల‌వ‌డానికి కోకొల్ల‌లుగా లభించగల దృష్టాంతాల్లో ఇదియునూ వొక‌టి. మొద‌టివాక్యంలో వాక్రుచ్చిన సాధార‌ణీక‌ర‌ణ‌కి రెండు మిన‌హాయింపులు క‌ల‌వు. ఒక‌టి, హీరో డాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ నేను డాక్ట‌ర్ కావాల‌ని కోరుకునేవాడిని కాదు. ఐ అడోర్ ద డాక్ట‌ర్స్, బ‌ట్ ఐ వజ్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ వ‌న్‌. రెండోది, సినిమాలో ఒక హీరో దొంగ మ‌రియూ ఒక హీరో పోలీసు అయిన ప‌క్షంలో, ఆబ్వియ‌స్‌లీ ఐ ఆల్వేస్ ప్రిఫ‌ర్డ్ టు బీ ఎ దొంగ‌.

ఆ వ‌య‌సులో అంతోటి ఆబ్సెష‌ను అజ్ఞానం కింద‌కి రాద‌నీ, దాదాపు ప్ర‌తి డిప్ప‌కాయ్ జీవితంలోనూ ఈ ద‌శ ఇనెవిటబుల్ అనీ మీబోటి స‌హృద‌యులు వాత్స‌ల్యానురాగ‌పూరిత స‌పోర్టుని అందించ‌డానికి సిద్ధ‌ప‌డ‌బోతున్నార‌ని నా మ‌న‌సు శంకిస్తోంది. కానీ, 'మ్యాట‌ర్ మ్యాక‌రోనీని డిమాండ్ చేస్తే పీట‌ర్ ప్రిపేర్డ్ పిల్లిపిష్టం' అనే సామెత తెలియ‌కే మీరు నామీద అకార‌ణ‌, అవాంఛిత సెంటిమెంటుని కురిపించ‌బోవ‌నెంచారు.

హీరోగారి వృత్తిప‌ట్ల నాకెంత‌టి గౌర‌వ‌దుర‌ద‌లుండేవో, అత‌గాడు వాడే యాక్సెస‌రీస్ ప‌ట్ల కూడా అంతే టిమ‌టిమ‌జ‌నిత టింగ‌ణం వుండేది. కొక్కెం వున్న మోకు, ప‌దునుగా వున్న చాకు, ఒక బూత‌ద్దం, అప‌రిమితంగా బుల్లెట్ల‌ని క‌లిగివుండ‌గ‌లిగి ఆఖ‌రి రెండు రీళ్ల సినిమానీ న‌డిపించ‌గ‌లిగిన అక్ష‌య‌తూణీరం లాంటి పిస్ట‌లూ... ఇవ‌న్నీ ఒక మ‌గ‌వాడి జీవితంలో అత్యంతావ‌శ్య‌క‌మ‌నీ నాకు అనిపించేది. ఫ‌స్టునైటు చేసుకోబోయే ఫ‌క్రుద్దీన్ అయినా, రాగిణియందు మనోవికారం గల్గిన రాబర్ట్ అయినా స‌రే పైన ఉద‌హ‌రించిన పారాఫెర్నిలియాతో మాత్ర‌మే త‌నను ఆల్‌మోస్ట్ వ‌ల‌చిన (లేదా ఆల్రెడీ వ‌ల‌చిన‌, లేదా వ‌ల‌చ‌బోయే) అమ్మాయి శీలాన్ని సంర‌క్షించ‌గ‌ల‌డ‌నే కన్‌ఫ్యూజ్డ్ క‌న్విక్ష‌న్ తో ముందుకెళ్తూవుండేవాడిన‌న్న‌మాట‌.

ధీర‌త్వ‌మూ, శూర‌త్వ‌మూ అనునవి యాక్సెస‌రీస్ కి కాకుండా లోప‌ల వుండే ఇంకేదో కీల‌క‌మైన ఎలిమెంటుకి సంబంధించిన‌వ‌ని తెలుసుకోలేక‌పోవ‌డంతో పాటు...
హీరోలూ విల‌న్లూ మ‌రియూ వారిని ఆశ్ర‌యించి వుండు మంచిగ్రూపు, దుష్ట‌గ్రూపు అనే రెండు శిబిరాలుగా ప్ర‌పంచం విడిపోయి వుంటుంద‌నే భ్ర‌మ‌లో వుండేవాడిని నేను.

చిన్న‌ప్పుడు బుర్ర‌ త‌క్కువ‌గా వుండేద‌నే క‌న్ఫెష‌న్‌తో మొద‌లెట్టాను క‌దా..!! మ‌రిప్పుడు బుర్ర కాస్తోకూస్తో పెరిగుండాలి క‌దా..!! అలాంట‌ప్పుడు గుట్టుచ‌ప్పుడు కాకుండా వూకోవాలి గానీ, ఇదంతా ఎందుకు బ‌య‌టెట్టుకుంటున్నాన‌నే సంశ‌యం మిమ్మ‌ల్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి లోను చేస్తుంద‌ని గ్ర‌హించిన‌వాడ‌నై, ఫైన‌ల్‌గా నా తలబిరుసుతనానికి ఇరుసుగా భావింపదగిన అస‌లు పాయింటు బ‌య‌టెట్టేస్తాను. రాజ‌కీయ‌నాయ‌కులు దైవాంశ‌సంభూతులనీ, మ‌న‌ల్ని ఉద్ధ‌రించ‌డానికి వ‌చ్చిన అవ‌తార‌పురుషులనీ (అవ‌తార స్త్రీలనీ కూడా) ఇల్యూజ‌నిత శ్లేష్మంలో ప‌డి కొట్టుకుంటూ, జీవితాలని ఆయా లీడ‌ర్ల‌ని కీర్తించ‌డంలో గ‌డిపే పెద్ద‌వాళ్ల‌ని చాలామందిని చూశాక‌, సదరు నాయకమ్మన్యుల తప్పుల్ని సైతం అత్యుత్సాహంతో సమర్థిస్తూ తమ క్రెడిబిలిటీని పోగొట్టుకోడానికి వెనుకాడని "అది" గమనించాక....

నా ఫ్లాష్‌బ్యాక్ మ‌రీ అంత ప‌ప్పీషేమ్ కాద‌నే జ్ఞాన‌బ‌ల్బు ఈ అర్థరేతిరేళ డింగుమని ఎలిగింది.

Discussion (0)