సీతారామశాస్త్రి కి వున్న అభ్యుదయ వ్యతిరేక భావజాలం ఆయన మతవిశ్వాసంలో నుండీ వచ్చిందే. మతం వల్ల వచ్చే సంకుచితత్వం ఏదైతే వుంటుందో, అది ఆయన మాటల్లో (అప్పుడప్పుడైనా) బయటపడి తీరుతుంది. హిందూమతం పట్ల ఆయనకున్న అభిమానమే ఆయనతో మోడీ, అమిత్ షా, ఆరెస్సెస్ లని పొగిడేలా చేసింది. ఆ మేరకి ఆయనతో నాకు పూర్తి విభేదం.
మతపిచ్చి, సంకుచితత్వానికి తావులేని పాటలు కొన్ని వందలు రాశాడాయన. దానిపట్ల నాకు ఆరాధనాభావం. ఆ పాటలన్నీ దోపిడీ స్వభావంలోంచీ, మతసాహిత్యం నుండీ వూడిపడినవి కావు. స్వతహాగా ఆయనలో ఆ సృజనాత్మక శక్తి వుంది. ఆ క్వాలిటీ వల్ల ఆయనంటే గౌరవం.
తెలుగు, సంస్కృతం భాషల్లో అంత పట్టు వుండి, సినిమా పాటల కవిగా అంత డిమాండ్ వుండి, కొన్ని వందల పాపులర్ పాటలు రాసిన ఒక బ్రాహ్మణుడికి ఎంత గర్వం, అహంకారం వుండడానికి అవకాశం వుందో అందులో సగం కూడా ఆయన ప్రవర్తనలో ఎప్పుడూ కనబడలేదు. ఆ మేరకు ఆయనంటే ఇష్టం.
కానీ, ఆయన సృజించిన భక్తి సాహిత్యం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగమూ లేదు (భక్తులకి వీనులవిందుగా వుండడం వల్ల వారికి కలిగే పారవశ్యం, ఆ సంగీతం కలిగించే తాత్కాలికమైన సాంత్వన పక్కనపెడితే). కాబట్టీ, లౌకికేతర సాహిత్యం ఆయనకి తెచ్చిపెట్టిన గుర్తింపుకి అందరి ఆమోదం లభించాల్సిన అవసరం లేదు.
కానీ, ఇక్కడ గుర్తించి తీరాల్సిన విషయమేమంటే... మతం వల్ల (లేదా మతం పేరిట) జరిగే దోపిడీనీ, అణచివేతనీ ప్రతిఘటించే వారిగా, ప్రశ్నించేవారిగా శాస్త్రిగారు (వారిలాంటి ఇతరులు) కనబరిచే భావజాలం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి మనకుండే హక్కులు ఎప్పుడూ వుంటాయ్. కానీ, మన అసంతృప్తి హిందూ వ్యతిరేక క్రైస్తవ మతపిచ్చిలో నుండీ వస్తుంటే మాత్రం అది సమంజసం కాదు.
దోపిడీకీ, వెనకబాటుతనానికీ వ్యతిరేకంగా ఎల్లప్పుడూ గొంతువిప్పే హేతువాదులు శాస్త్రిగారి మరణం నేపథ్యంలో చేసిన విమర్శలకీ, లేవనెత్తిన ప్రశ్నలకీ నా మద్దతు. వాళ్ల వాళ్ల సొంత ప్రార్థనా మందిరాల్లో కిందపడి దొర్లుతూ, పక్కమతం గురించి మాట్లాడేటప్పుడు రేషనలిస్టుల్లా నటించేవారి పట్ల నాకు జుగుప్స.
అలాగే.. సద్విమర్శకీ, కువిమర్శకీ తేడా తెలిసిన వ్యక్తివి అయ్యుంటే నువ్వు ఏం చేయాలంటే.. దోపిడీగుట్టుని బయటపెట్టడానికి ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తావో అదే ఉత్సాహాన్ని "సొంత ఎజెండాతో ఉన్మాదపూరిత విమర్శలు చేసే వారి విషపురాతల్ని" ఖండించడంలో కూడా కనబరచాలి. ఎందుకంటే విమర్శ హద్దులుమీరి, విద్వేషప్రదర్శనగా మారితే అది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందో నీకు తెలుసు కాబట్టీ.
శాస్త్రి గారూ, మీ పాటల్లో చాలావరకూ ఇష్టం. అందుకే మీరంటే ఇష్టం. స్వతంత్ర భారతం సురాజ్యం కాదని తెలిసిన మీరు మోడీ, అమిత్ షాలని నరనారాయణులుగా కీర్తించడం నాకు చాలా బాధాకరం. మీలోని ఆ పార్శ్వం పట్ల మా అయిష్టం. I will miss you a lot.
Discussion (0)