ఏకలింగం నెట్టంతా క్షుణ్ణంగా గాలించి, చివరికి పదివేలు వెచ్చించి అవాయ్ సువాయ్ కంపెనీ ఫోన్ కొన్నాడు. ఆ మర్నాడే అవాయ్ సువాయ్ వేరియర్ అనే మోడల్ రావడంతో ఏకలింగం కొన్న ఫోన్ ఆన్లైన్లో ఆరువేల ఐదొందలకి పడిపోయింది. ఈ విషయం తెలిసి ఘొల్లుమన్నాడు ఏకలింగం. తర్వాత మూడు రోజులకి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అవాయ్ సువాయ్ వేరియర్ మొబైల్స్ అన్నీ ఢమాల్ ఢమాల్ అని పేలిపోతున్నాయనీ, అది కొన్నవాళ్లందరూ స్వల్పంనుండీ ఒక మోస్తరుగా గాయపడ్డారనీనూ ఆ వార్త సారాంశం. అది విని ఏకలింగం చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.
ఢమాల్ ఢమాల్ ఎపిసోడ్‌తో రెపుటేషన్ దెబ్బతిన్నందుకు అవాయ్ సువాయ్ వేరియర్ కంపెనీవాళ్లు కూడా ఫీలయ్యి, తమ ఫోన్ కారణంగా గాయపడిన వాళ్లందరికీ ఫ్రీగా ఐఫోన్ కొనిస్తామని అనౌన్స్ చేశారు. ఏకలింగం మళ్ళీ ఘొల్లుమన్నాడు. తర్వాత పదిహేనురోజులకి పార్లమెంటులో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెంచుకోవడానికి.. "ఐఫోన్ వున్నవాళ్లందరికీ అసలు ఒక్కరూపాయి కూడా పన్ను మినహాయింపు లేదని" ప్రకటించారు ఫైనాన్స్ మినిస్టర్ దారుణ్జైట్లీ. ఏకలింగం ఆనందానికి అంతులేదు. హి ఈజ్ మళ్ళీ ఫీలింగ్ హ్యాపీస్.
ఇదిలావుండగా, దారుణ్ జైట్లీ దెబ్బకి మార్కట్లో ఐఫోన్ అమ్మకాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలిసి ఐఫోన్ కంపెనీ సీయీవో స్టీవ్ వుద్యోగమ్స్ కి కోపమొచ్చింది. ఐఫోన్ కొన్న ఇండియన్స్ కి పడే ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఆపిల్ కంపెనీయే భరిస్తుందని వాక్రుచ్చాడు. ఏకలింగానికి మళ్లీ పిచ్చి ప్రకోపించింది. విధి ఆడుతున్న వింత కబడ్డీలో తానొక ఎక్స్ ట్రా ప్లేయర్‌గా మారిపోవడం అతనికి చాలా అవమానాన్ని కలిగించింది.
అయితే అతని మనోభావాలతో సంబంధం లేకుండా జీవితపు ట్రాజిక్ కామెడీ కొనసాగిపోతూనే వుంది. ఐఫోన్లో జియో సిమ్ పనిచేయదనే పుకారు రావడంతో బాల్ మళ్లీ ఆపిల్ కోర్టులోకొచ్చింది. ఐఫోన్ కొనడం కోసం పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో మాన్పించి వీధిబళ్లలో చేర్చించిన పేరెంట్స్ అంతా ఆపిల్ కంపెనీపై దావా వేశారు. ఏకలింగం చాలా ఖుషీ అయ్యాడు.
ఇంతలో, సీయీవో స్టీవ్ వుద్యోగమ్స్ కాలం చేసి జాన్ టింబక్ కుర్చీ ఎక్కాడు. ఎక్కీయెక్కంగానే, అవాయ్ సువాయ్ కంపెనీని ఆపిల్ కొనేయబోతున్నట్టు ప్రకటించాడు. అవాయ్ సువాయ్ ఫోన్లన్నీ ఐఫోన్ తో రీప్లేస్ చేస్తామని హామీయిచ్చాడు. ఏకలింగం అగైన్ సంతోషానికి లోనయ్యాడు. కానీ అతన్ని ఆనందాన్ని ఖూనీ చేయడానికి మన టింబక్ మరో బాంబు పేల్చాడు. అవాయ్ సువాయ్ ఫోనుకి బదులుగా ఐఫోన్ యివ్వాలనీ, అందులోనే వేరియర్ మోడల్ అయితే ఏకంగా ఐప్యాడే యివ్వాలనీ ఫిక్సయ్యాడు.
అదృష్టం యిలా దోబూచులాడుతుండడంతో స్వతహాగా మానసిక దుర్బలుడైన ఏకలింగానికి గుండెపోటొచ్చింది.
పరామర్శ కోసం హాస్పిటల్‌కి వచ్చినవాళ్లలో ఆపిల్ కంపెనీ లోకల్ బ్రాంచి మేనేజర్ కూడా వున్నాడు. అతను ఏకలింగానికి ధైర్యం చెపుతూ యిలా అన్నాడు "తమాషా చూశారా. మీరు అవాయ్సువాయ్ పాత మోడల్ కొనడం మంచిదయ్యింది. తాజాగా జరిగిన టేకోవర్ నిబంధనల ప్రకారం వేరియర్ మోడల్ కొన్నవాళ్లకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్ లేదు. మీది అవాయ్ సువాయ్ పాత మోడల్ కాబట్టీ మీరు నిశ్చింతగా వుండొచ్చు. వైద్యానికి కోటిరూపాయలు ఖర్చయినా మేమే భరిస్తాం. ఇన్ఫాక్ట్...".
ఇంకా ఏదో చెపుతూనే వున్నాడు గానీ, ఆ మాటలు ఏకలింగం చెవిన పడలేదు. "మేమే భరిస్తాం..." అన్నమాట వినగానే ఆనందం తట్టుకోలేక ఏకలింగం పరమపదసోపాన పటంలో ఆఖరిమెట్టు కూడా ఎక్కేసి స్టీవ్ వుద్యోగమ్స్ తో కలిసి అష్టాచెమ్మా ఆడడానికి ఉద్యుక్తుడవుతున్నాడు.
నీతి: ఆన్ లైన్లో ఏదైనా కొన్నాక, హాయిగా వాడుకోవాలి. అంతేగానీ, దాని రేటు పెరిగిందా, తగ్గిందా అని వాకబు చేయకూడదు. చేస్తే జీవితం scond slot లో పన్జేయనని మొరాయించే జియో సిమ్ లా అయిపోద్ది.
Discussion (0)