Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

శాస్త్రిగారు మంచివారు.. కానీ, అమాయ‌కులేనా ?

Sridhar Bollepalli

నెహ్రూనీ, ఇందిర‌నీ యిష్ట‌ప‌డ‌ని చాలామంది లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిగారిని మాత్రం చాలా మంచివాడిగా కొనియాడ‌డం చూస్తాం. గాంధీగారిని ద్వేషించేవారిలో కూడా శాస్త్రిగారి ప‌ట్ల మాత్రం చాలా సానుభూతి క‌న‌బ‌డుతుంది. ఇది చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం క‌దా? పైగా శాస్త్రిగారు చాలా అమాయ‌కుడ‌న్న‌ట్లు మాట్లాడ‌తారు వీళ్లంద‌రూ. శాస్త్రిగారు మంచివాడ‌న్న‌ది నిర్వివాదాంశం. కానీ, ఆయ‌న అమాయ‌కుడైతే దేశానికి కూడా మంచిది కాదు క‌దా? అస‌లు అమాయ‌క‌త్వం అన్న‌ది ఎవ‌రిలో వున్నా అది నెగ‌టివ్ క్వాలిటీనే. పైగా వొక దేశాధినేత యిన్నొసెంట్ కావ‌డ‌మ‌న్న‌ది యింకా ప్ర‌మాద‌క‌రం. కానీ, నిజంగా శాస్త్రిగారు అమాయ‌కుడేనా? ఫ‌లానా నాయ‌కుడు గొప్ప‌వాడు అని చెప్పే చాలామందికి అస‌లు ఆ నాయ‌కుడి గురించి 1% కూడా తెలిసుండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కి శాస్త్రిగారినే తీసుకోండి. ఆయ‌న గురించి మ‌న‌లో చాలామందికి (అంద‌రికీ అన‌డం లేదు నేను) తెలిసింది ప‌ట్టుమ‌ని ప‌దివాక్యాలు కూడా వుండ‌దు. సో, నాకు తెలిసిన కొన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ పోస్టు వుద్దేశం.

నెహ్రూగారు చ‌నిపోయే స‌మ‌యానికే కాంగ్రెస్ పార్టీకి చాలా అవ‌ల‌క్ష‌ణాలు వ‌చ్చి చేరిన‌య్‌. ( ఆ ల‌క్ష‌ణాల్లో కొన్ని జాతీయోద్య‌మ కాలం నుండీ వున్న‌వి. త‌ర్వాత నెహ్రూగారి హ‌యాంలో వ‌చ్చిచేరిన‌వీ కూడా వున్నాయ్‌. ఆ అవ‌ల‌క్ష‌ణాల్లో కొన్నిటిని నెహ్రూగారు వ్య‌తిరేకించార‌నీ, కొన్నిటిని వుపేక్షించార‌నీ, ప‌రోక్షంగా కొన్నిటిని ప్రోత్స‌హించార‌నీ మ‌న‌కి అర్థ‌మ‌వుతుంది. మ‌నుషులంద‌రిలో వున్న‌ట్లే నెహ్రూగారిలో కూడా కొన్ని బ‌ల‌హీన‌త‌లు వున్న‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత కాలంలో వ‌చ్చిన నాయ‌కుల్లో ఆయ‌న‌తో స‌రితూగ‌గ‌లిగేవారు లేర‌న్న‌ది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం). సంజీవ‌రెడ్డి, కామ‌రాజ్‌, నిజ‌లింగ‌ప్ప‌, ఎస్‌కె పాటిల్‌, అతుల్య‌ఘోష్ లాంటి (సిండికేట్‌) ఉద్ధండ‌పిండాల మ‌ధ్య శాస్త్రిగారు ఎలా బ‌తికి బ‌ట్ట‌గ‌ట్ట‌గ‌లిగారు? అనేది వొక హీరోయిక్ స్టోరీ.

నెహ్రూగారు చ‌నిపోయిన తర్వాత ప్ర‌ధాని ప‌ద‌వికి శాస్త్రిగారు, మొరార్జీదేశాయ్ పోటీప‌డ్డారు. మొరార్జీ లాంటి మొండిఘ‌టం ప్ర‌ధాని అయితే ఎవ‌డిమాటా విన‌డ‌ని భ‌య‌ప‌డిన సిండికేట్ స‌భ్యులు శాస్త్రిగారి వైపు మొగ్గుచూపారు. స్వదేశీ పెట్టుబ‌డిదారుల కొమ్ము కాస్తాడ‌ని ముద్ర వున్న మొరార్జీకి వున్న బ‌లం ఏమిటంటే క‌మ్యూనిజం ప‌ట్ల ఆయ‌న‌కున్న‌ క‌ర‌డుగ‌ట్టిన వ్య‌తిరేక‌త‌. శాస్త్రిగారు ప్ర‌ధాని అయ్యాక త‌న‌కి క‌నీసం ఆర్థిక శాఖ యిస్తార‌ని మొరార్జీ ఆశించాడు. కానీ, హోంశాఖ యిస్తాన‌ని శాస్త్రిగారు ఆఫ‌ర్ చేశారు. ఇది విని మొరార్జీ మండిపడ్డాడు. తొక్క‌లో హొం మినిస్ట్రీ త‌న‌కి వొద్ద‌న్నాడు. ప్ర‌ధాని అయిన త‌ర్వాత శాస్త్రిగారు సిండికేట్‌ని పక్క‌న‌పెట్టారు. జ‌గ‌జ్జీవ‌న్ రామ్‌కి మంత్రి ప‌ద‌వి యివ్వ‌కుండా క‌రివేపాకులా తీసిపారేశారు. నెహ్రూలాగా తాను కూడా స్వ‌యంగా విదేశాంగ శాఖ‌ని నిర్వ‌హించి అంత‌ర్జాతీయంగా పేరు తెచ్చుకోవాల‌ని శాస్త్రిగారు ఆశించారు. కానీ, ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఆయ‌నకి హార్ట్ ఎటాక్ రావ‌డంతో (అప్ప‌టికే అది మూడోసారి. ప్ర‌ధాని కాక‌ముందు రెండుసార్లు) ప‌నివొత్తిడి త‌గ్గించుకోవ‌డం కోసం ఫారెన్ అఫైర్స్ ని స్వ‌ర‌ణ్ సింగ్ కు వ‌దిలేశారు.

ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక కూడా ఆయ‌న స్వ‌యంగా బ‌ట్ట‌లు వుతుక్కునేవాడ‌న్న‌ది నిజం కాదు. మొద‌టిసారి గుండెపోటు వ‌చ్చాక (1959) బ‌ట్ట‌లుతుక్కునే అల‌వాటుకి ఆయ‌న స్వ‌స్తిచెప్పారు. ఆయ‌న్ని త‌క్కువ చేయ‌డానికి చెప్ప‌డం లేదు ఈ విష‌యం. ప్ర‌ధాన‌మంత్రికి స‌వాల‌క్ష ప‌నులుంటాయ్‌. క్ష‌ణానికో నిర్ణ‌యం తీసుకోవాల్సిన కీల‌క‌ప‌ద‌విలో వుండి ఆయ‌న తాపీగా బ‌ట్ట‌లుతుక్కోవ‌డం క‌రెక్ట్ కాదు. ఆయ‌న ఆ అల‌వాటు ప‌క్క‌న పెట్ట‌డం మంచిదే. సిండికేట్ స‌భ్యుల‌కున్న‌ట్లే శాస్త్రిగారికి కూడా ఇందిరాగాంధీ అంటే కోపం వుండేది. తాను ప్ర‌ధాని అయ్యాక ఇందిర అపాయింట్‌మెంట్ అడిగితే వారం, ప‌దిరోజులు వెయిట్ చేయించేవారు. (ఇందులో కూడా త‌ప్పు బ‌ట్ట‌డానికి ఏమీ లేదు. త‌న ప్రాధాన్య‌త‌ల ప్ర‌కారం ఎవ‌రిని క‌ల‌వాలీ, ఎవ‌రిని క‌ల‌వొద్దు అన్న‌ది ఆయ‌న యిష్టం). త‌న సొంత‌ముద్ర వేయాల‌ని ఎంత కోరిక‌గా వున్నానెహ్రూకి వున్న యిమేజ్ ఎలాంటిదో తెలిసిన వ్య‌క్తిగా ఇందిరాగాంధీని త‌న క్యాబినెట్లో చేర్చుకోవాల‌ని అనుకున్నారు. మొద‌ట కాద‌న్న ఇందిర చివ‌రికి స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ తీసుకుంది.

త‌న రేంజి ఏంటో దేశం న‌లుమూల‌లా తెలియ‌డానికి వీలుగా నెహ్రూగారు త‌న భుజం మీద చేయి వేసి మాట్లాడుతున్న క్యాలెండ‌ర్ అచ్చువేయించి అది ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలో వుండాల‌ని ఆదేశించారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో "సోష‌లిజం" అనే ప‌దం అవ‌స‌రం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి ఆ ప‌దం తీసేయించారు. త‌ర్వాత విమ‌ర్శ‌లు రావ‌డంతో స‌మ‌స‌మాజ స్థాప‌నే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ర‌ష్యా న‌మూనాకి అనుకూలంగా వుంద‌న్న కార‌ణంగా ప్లానింగ్ క‌మీష‌న్ ప్రాధాన్య‌త‌ని త‌గ్గించేశారు. అమెరికాతో సంబంధాల వృద్ధికి ప్ర‌య‌త్నించారు. ఆర్థిక‌మంత్రి టిటి కృష్ణ‌మాచారి వ‌ద్ద‌ని మొత్తుకుంటున్నా, ఆయ‌న్న ప‌ద‌వినుండీ త‌ప్పించి మ‌రీ రూపాయి మార‌కం విలువ‌ని వొకేసారి 36% తగ్గించారు. ఇది ప్రతికూల ఫలితాలని యిచ్చిందని చరిత్ర నిరూపించింది. హిందీని కంపల్స‌రీ చేయాలి అనే రైట్ వింగ్ వొత్తిడికి త‌లొగ్గి తీసుకున్న నిర్ణ‌యం ఆయ‌నని చాలా యిబ్బంది పెట్టింది. ఆ విష‌యంలో ఆయ‌న వెన‌క‌డుగు వేయాల్సొచ్చింది. కాంగ్రెస్ లో వున్న సోష‌లిస్టులు శాస్త్రిగారి ప‌ట్ల అసంతృప్తితో వున్నారు. తీసుకున్న నిర్ణ‌యాల‌పై నిల‌బ‌డ‌కుండా వెన‌క్కిత‌గ్గ‌తున్నాడ‌ని రైటిస్ట‌లు ఆయ‌న ప‌ట్ల ఆగ్ర‌హంతో వున్నారు. మ‌రోవైపు బ్లాక్ మార్కెటింగ్ బీభ‌త్సంగా విజృంభించింది. 1964-66 మ‌ధ్య (శాస్త్రిగారి పాల‌నాకాలం) ఆహారోత్ప‌త్తి 20% త‌గ్గిపోయింది. ర‌ష్యాని కాద‌ని అమెరికాతో చెలిమి చేసినా బొకారో క‌ర్మాగారం విష‌యంలో అమెరికా వంద మెలిక‌లు పెట్టింది. చివ‌రికి ఆ ప్రాజెక్టుని ర‌ష్యామీదే ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే పాక్ తో యుద్ధం చేయాల్సి వ‌చ్చింది.

యుద్ధం సంద‌ర్భంగా ఏమైంద‌న్నది ప‌క్క‌న పెడితే... ఇండియా, పాక్ దేశాధినేత‌లు ర‌ష్యాలోని తాష్కెంటులో వొక సంధి వొప్పందం మీద సంత‌కాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దౌత్యప‌రంగా అది ఇండియాకి ఓట‌మి కిందే లెక్క‌. పాక్ నుండీ నిర్దిష్ట‌మైన హామీ ఏం తీసుకోకుండానే ఒప్పందం మీద సంత‌కానికి భారత్ సిద్ధ‌ప‌డ‌డం అనేక విమ‌ర్శ‌ల‌కి తావిచ్చింది. అస‌లు దీనిని ఒప్పందం అని పిల‌వ‌డానికి సిద్ధంగా లేమ‌నీ, కావాలంటే తాష్కెంట్ డిక్ల‌రేష‌న్ అని పిలుచుకోవ‌చ్చ‌నీ తెంప‌రిత‌నం ప్ర‌ద‌ర్శించిన పాక్ ధోర‌ణితో రాజీ ప‌డాల్సివ‌చ్చింది. ఇది శాస్త్రిగారిని చాలా యిబ్బంది పెట్టింది. 1962 చైనాయుద్ధం చివ‌రికి నెహ్రూగారి అనారోగ్యానికీ, అంతిమంగా మ‌ర‌ణానికీ ఎలా కార‌ణ‌మైందో.. 1966 లో పాక్ తో జ‌రిగిన యుద్ధం శాస్త్రిగారి విష‌యంలో అదే ప‌ని చేసింది. జ‌రిగిన ప‌రిణామాల‌తో శాస్త్రిగారు ఖిన్నులైపోయారు. అప్ప‌టికే మూడుసార్లు గుండెపోటు రావ‌డం, అధికారంలో వున్న కాలంలో ఎదురైన సంక్షోభాలూ ఆయ‌న ఆరోగ్యాన్ని యింకా దెబ్బ‌తీశాయి. తాష్కెంట్ లో వుండ‌గానే నాలుగోసారి గుండెపోటు రావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు. ఇందులో కుట్ర‌కోణం వుండ‌డానికి అవ‌కాశాలు త‌క్కువ‌.

శాస్త్రిగారు ప్ర‌ధానిగా వున్న కాల‌మంతా సంక్షోభాల మ‌యం. అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య ఆయ‌న ప‌నిచేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. అటు కాంగ్రెస్ పార్టీనుండీ కానీ, ఇటు జ‌న‌సంఘ్ స్వ‌తంత్ర పార్టీనుండీ కానీ ఆయ‌న‌కి మ‌ద్ద‌తు దొర‌క‌లేదు. ఈరోజు ఆయ‌న్ని పొగిడే వ్య‌క్తులు ఎలాంటి పార్టీల‌కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారో.. ఆరోజు అవే పార్టీలు (లేదా అలాంటి పార్టీలు) ఆయ‌న బ‌తికున్న కాలంతో ఆయ‌న గురించి మంచిగా చెప్ప‌లేదు. శాస్త్రిగారు అంటే కొంత‌మందికి యిష్టం, ఇందిర‌ని యిబ్బంది పెట్టాడు కాబ‌ట్టీ. శాస్త్రిగారు అంటే కొంద‌రికి యిష్టం, సోష‌లిజానికి దూరంగా జ‌రిగే ప్ర‌య‌త్నం చేశాడు కాబ‌ట్టీ. శాస్త్రిగారు అంటే కొంద‌రికి యిష్టం, అమెరికాతో చెలిమికి బీజాలు నాటాడు కాబ‌ట్టీ. శాస్త్రిగారు అంటే నాకిష్టం ఆయ‌న గాంధేయ‌వాది కాబ‌ట్టీ..! పూర్తిగా కాక‌పోయినా పాక్షికంగా అయినా..!

ఆనాటి చాలామంది పొలిటీషియ‌న్ల లాగా శాస్త్రిగారు కూడా మంచివారే. కానీ, రాజ‌కీయాల్లో ఎద‌గాల‌న్నా, నిల‌దొక్కుకోవాల‌న్నా అనివార్యంగా చేయాల్సిన కొన్ని ప‌నులు వెన‌కాడ‌కుండా చేసిన‌వారే. అందులో పెద్ద‌గా ఆక్షేపించ‌డానికి కూడా ఏమీ లేదు. ఆయ‌న పాల‌నా కాలంలో జ‌రిగిన పొర‌పాట్లు ఏమైనా వుంటే అవి వ్య‌క్తిగ‌తంగా త‌న‌కి లాభిస్తాయ‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల ఫ‌లితం కాదు. ఆయా నిర్ణ‌యాల వ‌ల్ల దేశానికి నిజంగా మంచి జ‌రుగుతుంద‌ని ఆయ‌న న‌మ్మార‌న్న‌ది తిరుగులేని వాస్త‌వం.

Discussion (0)