Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for ఇక నుండీ ఫ‌లానా దాని పేరు ఫ‌లానా

ఇక నుండీ ఫ‌లానా దాని పేరు ఫ‌లానా

Sridhar Bollepalli

నీకు పిల్లి కుక్క‌లాగా క‌నిపించింద‌నుకో. అవ‌త‌లివాళ్లకి కూడా అలాగే క‌నిపించి తీరాలి. "అది కుక్క కాదురా నాయ‌నా, పిల్లి" అని ఎవ‌రైనా చెపితే నీకు రుచించ‌దు. "నిజ‌మే అది కుక్కే, పిల్లి కాదు" అని నీకు వంత పాడేవాళ్ల‌లో చాలామందికి నిజం ఏంటో తెలిసుంటుంది. కానీ, నీతో ప‌నుండ‌డం వ‌ల్ల కానీ, లేదా పిల్లిని కుక్క అని న‌మ్మ‌డంలో కానీ వాళ్ల‌కేదో ప్ర‌యోజ‌నం వుండి వుంటుంది. కానీ, ఇక్క‌డ పెద్ద కామెడీ ఏంటంటే.. నీతో పాటు తందానా అనే వంత‌గాళ్లు ఎవ‌రైతే వుంటారో వాళ్లు నీ గురించి మ‌న‌సులో ఇలా అనుకుంటారు, "ఇత‌ను (లేదా ఈమె) పిల్లిని ప‌ట్టుకొని కుక్క అన‌డం హాస్యాస్ప‌దంగా వుంది. కానీ, న‌మ్మిన‌ట్టు న‌టించ‌డం వ‌ల్లా, తందానా అన‌డం వ‌ల్లా నాక్కూడా ఉప‌యోగ‌మే కాబ‌ట్టీ నేనూ అదే పాట పాడ‌తాను. కానీ, పిల్లి ఏదో, కుక్క ఏదో తెలీని ఈయ‌న‌ (లేదా ఈమె) మాట‌లు మిగ‌తా విష‌యాల్లో మాత్రం న‌మ్మ‌కూడ‌దు. కానీ, మ‌నం న‌మ్మ‌లేద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి".

వేరేవాళ్ల పిల్ల‌లు నీ ఇంటికొచ్చి పెంట‌పెంట చేస్తే పిల్ల‌ల్ని అదుపులో పెట్ట‌లేని పేరెంట్స్ ని దుమ్మెత్తిపోస్తావ్‌. నీ పిల్ల‌లు వేరే వాళ్ల ఇళ్ల‌లో పెంట చేస్తే చైల్డ్ సైకాల‌జీని అరువు తెచ్చుకుంటావ్‌. అప్ప‌నంగా బొక్క‌గ‌లిగే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వ రంగ‌మే మంచిదంటావ్‌. నువ్వు రిటైర‌య్యి, నీ పిల్ల‌లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల‌య్యి గ్లోబ‌లైజేష‌న్ ఘ‌న‌తాగాన వివ‌శ‌త్వంతో వూగిపోతుంటే శృతి క‌లుపుతావ్‌.

నీ గాళ్ ఫ్రెండు నిన్నొదిలేసి వేరేవాడిని వెతుక్కుంటే నీకు స్త్రీ వాదం న‌చ్చ‌దు. "నా ప‌ర్స‌న‌ల్ ఎక్స్ప‌రీయెన్సు అలా త‌గ‌ల‌డింది కానీ, నిజానికి ఫెమినిజం స‌మాజానికి చేసిన మంచి కూడా చాలా వుంది" అనుకుంటావా? చ‌చ్చినా అనుకోవు. నీకు బాగా న‌చ్చి, నువ్వు తెగ హ‌డావుడి చేసేసి గెలిపించిన నాయ‌కుడు నీ రేష‌న్ కార్డు పీకేశాక ఏం చేస్తావు? ఆ నాయకుణ్ని అమ్మ‌నా బూతులు తిట్టి, వేరే పార్టీలోకి జంప్ అవుతావు. నువ్వు ఇన్నాళ్లూ గుడ్డ‌లు చింపుకోని మ‌రీ భ‌జ‌న చేసిన విష‌యం మ‌ర్చిపోయి కొత్త ప‌ల్ల‌వి అందుకుంటావు.

అణ‌గారిన వ‌ర్గాల‌కి మ‌రిన్ని అవ‌కాశాలు కావాల‌ని వేదిక‌లెక్కి ఉప‌న్యాసాలిస్తావు. అలాగే "నాయ‌నా, బ‌ల‌హీనుల‌కి రిజ‌ర్వేష‌న్లు ఇంకో ప‌దిశాతం పెంచుతాం. కానీ, నీకాల్రెడీ ఉద్యోగం వుంది కాబ‌ట్టీ నీ పిల్ల‌ల‌కి మాత్రం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌దు, స‌రేనా" అంటే తుపాకీ గుండుకి దొర‌క్కుండా మాయ‌మ‌వుతావ్‌. నువ్వు రైతువైతే కూలీల మీద ప‌డి ఏడుస్తావ్‌. నువ్వు వ్యాపారివైతే ఉద్యోగుల మీద ప‌డి ఏడుస్తావ్‌. నువ్వు ఉద్యోగ‌స్తుడివైతే తెల్ల రేష‌న్ కార్డుల మీద ప‌డి ఏడుస్తావ్‌. "నీ పిల్ల‌లు అమెరికాలో వున్నారుగా, ఊళ్లో స‌గం ఆస్తులు నువ్వే కొనేశావుగా, నీ తెల్ల‌కార్డు పీకేద్దామా" అంటే నువ్వొప్పుకోవు.

"నీ ఫ్రెండుని ముండా అంటే నీకు కోప‌మొచ్చింది, మ‌రి నా ఫ్రెండుని లం.. అన్నందుకు నువ్వు ఫీల‌వ్వ‌వేంటి" అంటే నీకు నోరు పెగ‌ల‌దు. నువ్వు పుట్టిన కులం, నువ్వు న‌మ్మిన మ‌తం, నీకు దొరికిన రాయితీలు, నీకు మందు పోయించిన‌వాడు, నీ అవినీతిని వెన‌కేసుకొచ్చిన‌వాడు, పోలీస్ స్టేష‌న్లో నీ త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకొని, నువ్వు రాత్రంగా లాక‌ప్పులో వుండ‌కుండా చూసిన‌వాడు., వీట‌న్నిటి మీదా ఆధార‌ప‌డి నీ న‌మ్మ‌కాల సౌధాన్ని నిర్మించుకుంటావ్‌. అదే ప‌ని వేరేవాళ్లు చేసిన‌ప్పుడు బొక్క‌లెతుకుతావ్‌.

ఇదంతా అర్థం చేసుకోద‌గిందే. మ‌నిషి పుట‌క పుట్టినందుకు సుఖంగా బ‌తికే మార్గం వెతుక్కోవ‌ల‌సిందే. సిగ్గొదిలేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ ముందుకు పోవాల్సిందే. అంద‌ర‌మూ అలా పోతున్న‌వాళ్ల‌మే. ఇది ఇలా కాకుండా ఇంకోలా వుండ‌డానికి అవ‌కాశ‌మే లేదనీ, ఈ ప‌రిస్థితి అనివార్య‌మ‌నీ మ‌న‌కి తెలీనిదా ఏంటి..! కానీ... నువ్వు నమ్ముతున్నదే గొప్ప ఆద‌ర్శ‌మ‌నీ, నువ్వు అంద‌రికంటే వివేక‌వంతుడివ‌నీ, ఏ ప్ర‌భావాలూ ప్ర‌లోభాలూ అంట‌కుండా స‌ర్వ‌మాన‌వ క‌ళ్యాణం కోసం నీ ఆలోచ‌న‌ల‌ని అంకితం చేశావ‌నీ నిన్ను నువ్వు కూడా న‌మ్మించుకుంటుంటావ్ చూడూ..! అదే మాజిక్కు. అంత‌కంటే పెద్ద మాజిక్కేంటంటే... నీ బోలుత‌నం, నీ సొల్లుక‌బుర్లు చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకునే నేను కూడా నా గురించి ఏమ‌నుకుంటానో తెలుసా? నీ గురించి నువ్వు ఏమ‌నుకుంటావో అదే. నేను అలా అనుకోడాన్ని చూసి దేనితోనో న‌వ్వే మూడోవాడు కూడా త‌న గురించి తాను అదే అనుకుంటాడు. ఇదంతా చూడ్డానికి షిట్టులాగా వుంది క‌దా? But, we can't run away from this shit. We just redefine what, actually, shit is. So, Shit is something that makes you shit your pants.

Discussion (0)