Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

అమ‌రావ‌తి టు వైజాగ్‌

Sridhar Bollepalli

రాజ‌ధాని మార్పుగురించి నా అభిప్రాయాలు పంచుకునేముందు ఒక్క విష‌యం స్ప‌ష్టం చేయాలి. నా ఓటు అమ‌రావ‌తికే. దీనివెనుక ప‌నిచేసింది ఆద‌ర్శ‌మా, నా వ్య‌క్తిగ‌త స్వార్థ‌మా అన్న‌ది త‌ర్వాత విష‌యం.

ఓటుకి ఐదువంద‌లు తీసుకునే జ‌నాలు.. ఎమ్మెల్యే కావ‌డానికి ప‌దినుండీ యిర‌వైకోట్లు ఖ‌ర్చుచేయాల్సిన మేడిపండు ప్రజాస్వామ్యం.. ఈ నేప‌ధ్యంలో ఒక రాష్ట్ర‌స్థాయి నాయ‌కుడు త‌న వ్య‌క్తిగ‌త స్వార్థం కోస‌మో, లేక త‌న పార్టీ ఎదుగుద‌ల కోస‌మో కాకుండా, మెజారిటీ జ‌నాల విశాల‌హితం కోసం ఆలోచిస్తాడ‌ని న‌మ్మ‌డం క‌న్నా ----త్వం యింకోటి వుండ‌దు. అవినీతిప‌రుడు కానివాడు నాయ‌కుడిగా మ‌నుగ‌డ సాగించ‌లేని ప‌రిస్థితుల్ని ప్రోత్స‌హిస్తూ, ఆ ప్రాసెస్‌లో మ‌న‌కి దొరికే ఎంగిలి మెతుకుల్ని ఏరుకోడానికి అల‌వాటుప‌డ్డ మ‌నం అప్పుడ‌ప్పుడూ నిద్ర‌లేచి, కాసేపు ఓండ్ర‌పెట్టి, మ‌ళ్లీ ఆవులిస్తూ నిద్ర‌పోతుంటాం. అవినీతికి పాల్ప‌డ‌డానికి వెనుదీయ‌నివాడు, ఆ అవినీతిని అందంగా క‌ప్పిపుచ్చుకోగ‌లిగిన‌వాడు, త‌న వ్య‌క్తిగ‌త ఎదుగుద‌లే లోక‌క‌ళ్యాణానికి దారితీస్తుంద‌ని ప్ర‌జ‌ల్నిన‌మ్మించ‌గ‌లిగిన‌వాడు మాత్ర‌మే కుర్చీలో కూచుంటాడు. ఆ విద్య అంద‌రికీ ప‌ట్టుబ‌డేది కాదు. దానికోసం చాలా తెలివితేట‌లు, క‌ష్టం, త్యాగం, ధైర్యం అవ‌స‌రం అవుతాయి. అవ‌న్నీ వుండ‌డంతోపాటు, కాస్త అదృష్టం కూడా క‌లిసొస్తేనే... రామారావు అయినా, వైయ‌స్సార్ అయినా, చంద్ర‌బాబు అయినా, జ‌గ‌న్ అయినా ఆ స్థాయికి వ‌చ్చారు. వీళ్లంతా మొన‌గాళ్లు. వీధికుక్క‌ల‌ని క‌నుసైగ‌తో ఆడించ‌డం ఎలాగో క్షుణ్ణంగా తెలిసిన‌వాళ్లు. మ‌నం కావాల‌నుకున్న‌వాళ్లు.


త‌న‌కో, త‌న కులానికి చెందిన‌వారికో, లేదా కులానికి సంబంధం లేకుండా త‌న‌కి అనుకూలంగా వుండేవారికో లాభం క‌లిగేవిధంగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దాల‌ని చంద్ర‌బాబునాయుడుగారు భావించ‌డం 100% అర్థం చేసుకోద‌గిన విష‌యం. మెడ‌కాయ‌మీద త‌ల‌కాయ వున్న ఎవ‌రైనా అదే ప‌ని చేస్తారు. నేను ముందే చెప్పిన‌ట్లుగా... కుక్క‌ల‌నీ పందుల‌నీ సంతృప్తిప‌ర‌చ‌డ‌మే రాజ‌కీయ‌నాయ‌కుల ప్రాధ‌మిక బాధ్య‌త‌గా మారిన‌చోట‌, ఒక నాయ‌కుడు యింత‌క‌న్నా భిన్నంగా ఆలోచించాల‌నుకోవ‌డం అవివేకం. టీడీపీ ఓడిపోయి, జ‌గ‌న్‌గారు సీఎం అయిన త‌ర్వాత‌, అమ‌రావ‌తి అనేది త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకి గొడ్డ‌లిపెట్టుగా మారుతుంద‌ని గ్ర‌హించ‌డం, ఆ ముప్పుని త‌ప్పించాల‌నుకోవ‌డం కూడా 100% అర్థం చేసుకోవాల్సిన విష‌యం. మెడ‌కాయ‌మీద త‌ల‌కాయ వున్న ఎవ‌రైనా అలాకాకుండా వేరేలా చేయాల‌నుకోవ‌డం హాస్యాస్ప‌దం. ఇంటిమీద ఏ జెండా ఎగ‌రేశామూ అన్న‌ది జ‌నం ఏనాడో మ‌ర్చిపోయారు. ఎవ‌రు రుణ‌మాఫీ చేస్తారు, ఎవ‌రు బేవార్సుగా కొత్త‌రుణాలు మంజూరు చేస్తారు, ఎవ‌రు మ‌న‌కి అప్ప‌నంగా జీతాలు పెంచుతారు, ఎవ‌రు మ‌న అవినీతిని చూసీచూడ‌కుండా వ‌దిలేస్తారు అన్న‌ది మాత్ర‌మే ఓటేయ‌డానికి క్రైటీరియాగా పెట్టుకున్న జ‌నాలు రాజ‌కీయ‌నాయ‌కుల్ని విమ‌ర్శించ‌డం క‌న్నా విడ్డూరం మ‌రొక‌టి కాన‌రాదు.


కానీ... ఐదేళ్ల త‌ర్వాత నేను మ‌ళ్లీ సీఎం కాక‌పోతే ప‌రిస్థితి ఏంటీ అన్న‌ది చంద్ర‌బాబుగారు ఆలోచించి వుండాల్సింది. త‌న‌ని న‌మ్మి భూములు యిచ్చిన‌వారు, ఎక్క‌ణ్నించో వ‌చ్చి అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర‌లో భూములు కొనుక్కున్న‌వారు, త‌న సొంత‌వారు, త‌న‌కి సంబంధం లేనివారు... వీళ్లంతా ఏమ‌వుతారు అని ఆయ‌న ఎందుకు ఆలోచించ‌లేదో నాకు అంతుప‌ట్టడం లేదు. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా స‌రే అక్క‌డ‌త‌ప్ప యింకోచోట రాజ‌ధాని నిర్మించ‌డం అనే ఆలోచ‌నే చేయ‌లేనంత ప‌క‌డ్బందీగా ఏర్పాటు చేసివుండాల్సింది. లీగ‌ల్‌గా ఆయా వొప్పందాల‌కి ర‌క్ష‌ణ క‌ల్పించి వుండాల్సింది. అలా చేయ‌డానికి అవ‌కాశం వుండివుండేదా, లేదా అన్న‌ది నాకు తెలియ‌దు. నిపుణులు చెప్పాలి. టీడీపీ నాయ‌కుల‌కీ, సానుభూతిప‌రుల‌కీ ఆర్థికంగా క‌లిగేన‌ష్టం, దానివ‌ల్ల పార్టీ భ‌విష్య‌త్తుపై ప‌డే ప్ర‌భావం అనే కోణాన్ని కాసేపు ప‌క్క‌న‌పెడితే.... ఈ రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా, ఎక్క‌డెక్క‌డి ఆస్తులో అమ్ముకొని అమ‌రావ‌తిలో పెట్టుబ‌డి పెట్టిన వేలాదిమందికి ప‌రిష్కారం చూపించాల్సిందే. నాకు అమ‌రావ‌తిలో సెంటుభూమి కూడా లేదు. కానీ, మా జిల్లాకి ఆనుకొని రాజ‌ధాని వుందీ అనే ఆలోచ‌న‌కి అల‌వాటు ప‌డిన‌మీద‌ట‌, యిప్పుడు తూచ్ అనుకోవాల్సిరావ‌డం నాకు చాలా యిబ్బందిగానే వుంది. ల‌క్ష‌లు, కోట్లు పెట్టుబ‌డి పెట్టిన‌వాళ్ల‌కి ఎంత బాధ‌గా, క‌ష్టంగా వుంటుందో క‌దా! ఈ ఐదేళ్లూ ఎన్నిక‌ల‌లు క‌నివుంటారో క‌దా! వాళ్ల జీవితాల్లో కొత్త‌గా వ‌చ్చిన మార్పుల‌నుండీ మ‌ళ్లీ వెన‌క్కివెళ్ల‌డం, పాత జీవితాల‌కి అల‌వాటు ప‌డ‌డం ఎంత దుర్భ‌రంగా తోస్తుందో క‌దా! ఈ పాపం వైయ‌స్సార్సీపీదేకాదు, టీడీపీది కూడా అని నా స్ట్రాంగ్ ఫీలింగ్‌..


ఇక జ‌గ‌న్‌గారి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఫ్యూచ‌ర్‌, ఆయ‌న పార్టీ ఫ్యూచ‌ర్ ఆయ‌న చూసుకున్నారు ఈ విష‌యంలో.
ఒక‌వేళ...
1) 2014 లో జ‌గ‌న్ గారు ముఖ్య‌మంత్రి అయ్యివుండి, ఆయ‌న అమ‌రావ‌తిని ఎంచుకొని వుంటే
2) 2019 లో చంద్ర‌బాబుగారు సీఎం అయిన ప‌క్షంలో
సీబీఎన్ కూడా అంద‌ర్నీ త‌ట్టాబుట్టా స‌ర్దుకొని వైజాగ్ వెళ్లమ‌నే చెప్పివుండేవారు. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి సందేహ‌మూ వుండాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టీ, జ‌గ‌న్‌గారు చేసింది పెద్ద ఆశ్చ‌ర్య‌పోవాల్సిన విష‌యం అని నాకైతే అనిపించ‌డం లేదు. ప్ర‌తిప‌క్షాన్ని రాజ‌కీయంగా చావుదెబ్బ కొట్టాల‌ని అనుకోవ‌డం మీదే ఇందిరాగాంధీ నుండీ మోడీవ‌ర‌కూ త‌న సామ్రాజ్యాలని నిర్మించుకోగ‌లిగారు. (చివ‌రికి అవి పేక‌మేడ‌ల్లా కూలాల్సిన త‌రుణం వొక‌టి రావొచ్చు, అది వేరే విష‌యం).
కానీ, రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా రాజ‌ధాని మార్పు కార‌ణంగా న‌ష్ట‌పోతున్న వారెవ‌రు? వారికి ఏ ర‌కంగా న్యాయం చేయ‌గ‌ల‌ను? అనే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం వెత‌కాల్సిన అవ‌స‌రం సీఎం గారికి వుంది. ఆ ప‌నిని ఆయ‌న ఎంత నిజాయితీగా చేయ‌గ‌ల‌రు అనేదానిమీదే, చ‌రిత్ర‌లో ఆయ‌న స్థానం ఏమిట‌న్న‌ది నిర్ణ‌యం అవుతుంది.


ఎవ‌రు లాభ‌ప‌డ‌తారు, ఎవ‌రు న‌ష్ట‌పోతారు, ఏ పార్టీకి ల‌బ్ది చేకూరుతుంది అన్న‌ది నాకు అన‌వ‌స‌రం. అమ‌రావ‌తికి సంబంధించి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో నిజమైన బాధితుల శాతం కూడా గ‌ణ‌నీయంగానే వుంది. వాళ్ల బాధ నాకు అర్థం అవుతుంది. వారి స్థానంలో వుంటే నాకు గుండె ప‌గిలిపోయేద‌ని తెలుస్తోంది. వీట‌న్నిటికీ మించి, రాజ‌ధాని మావూరికి ద‌గ్గ‌ర‌లో వుండాలనే స్వార్థం కూడా నాకుంది. ఇలాంటి స్వార్థాలే అంద‌రికీ వుంటాయి. అవి మ‌న‌లో వుండ‌డం మ‌న‌కి గ‌ర్వ‌కార‌ణం. ప‌క్కోడికి వున్న‌ప్పుడు దిగ్భ్రాంతిక‌రం. అంతేగా??!!

Discussion (0)