ఏవండీ.. పండక్కి మా అమ్మావాళ్లింటికి వెళదాం అనుకుంటున్నా. ఏమంటారు?
అలాగేనోయ్.. దానికేం భాగ్యం, తప్పకుండా వెళుదువుగాని.. 😎
పుట్టింటికెళతా అనంగానే ఎగిరి గంతేసి, సరే అనడమేనా? కనీసం మాటవరసకి "నువ్వు లేకుండా నేనుండలేను వొద్దులే" అనడానికి నోరు రావట్లేదా..
* * * * *
ఏవండీ.. పండక్కి మా అమ్మావాళ్లింటికి వెళదాం అనుకుంటున్నా. ఏమంటారు?
నువ్వు లేకుండా నేనుండలేను భాగ్యం. వొద్దులే, ఈసారికి ఆగిపోరాదూ..😉
ఎంతసేపూ ఎదురుగా దిగేసుకొని, చాకిరీ చేయించుకుందామని తప్ప, కనీసం ఏడాదికి ఓమారైనా సరదాగా పుట్టింటికెళ్లి నాలుగురోజులు విశ్రాంతి తీసుకుంటుందనేపాటి మానవత్వం కూడా లేకుండా పోయిందేం..
* * * * *
ఏవండీ.. పండక్కి మా అమ్మావాళ్లింటికి వెళదాం అనుకుంటున్నా. ఏమంటారు?
నీ ఇష్టం భాగ్యం. నాలుగురోజులు వూరికెళ్లొస్తే నీకూ కాస్త విశ్రాంతిగా వుంటుంది. కానీ, నువ్వు లేకుండా వొంటరిగా వుండడం నాకిష్టం లేదు. అలాగని నిన్ను ఆగమని చెప్పలేను. నీకు ఏది మంచిదనిపిస్తే అలా చెయ్యి.. 🙄
ఆబ్బబ్బబ్బబ్బబ్బా.. ఈ తెలివికేం తక్కువలేదు. కొడుకు బాగుండాలి కానీ కోడలు ముండమొయ్యాలందట వెనకటికొకత్తె. అలా వుంది సంబడం. వెళ్లమనో, వొద్దనో ఏదోవొహటి ఆలోచించేపాటి సమయం కూడా నాకోసం కేటాయించలేరన్నమాట. మా తాళ్లరేవు తాతయ్య మనవరాలు అప్పుడే చెప్పింది "అబ్బాయి కొంచెం తేడాగా వున్నాడే" అని. ఇప్పుడనుకొని ఏం లాభం?
* * * * *
ఏవండీ.. పండక్కి...
హలో.. హలో.. అబ్బా ఈ సిగ్నలొకటి.. 😆
ఏ మూలున్నా వినబడి చావదు.. హలో.. హలో. ఏమోయ్.. మా ఆఫీసరు పీనుగ. పగలూ లేదూ రాత్రీ లేదూ. ఎప్పుడుబడితే అప్పుడు ఫోన్లు. ఏమంటున్నాడో ఏమిటో వినబడి చావడం లేదు. అలా బయటికెళ్లి వినే ప్రయత్నం చేసొస్తా.
(పాత పాత పోస్టు. కోపగించుకొనవలదు)
Discussion (0)