నాలుగు నుండీ ఏడు వరకూ నేను విస్సన్నపేటలో వున్న సెయింట్ థెరెస్సాస్ స్కూల్ లో చదివాను. ఆ స్కూలుకి అనుబంధంగా ఒక చర్చి కూడా వుండేది. అక్కడొక ఫాదర్ గారు వుండేవారు. పేరు మారియో పుమ్మగల్లీ. ఆయనది ఇటలీ. ఆయన పేరుకి మాకు తెలిసిన ప్రనన్సియేషన్ కరెక్టో కాదో నాకు క్లారిటీ లేదు.
ఆ స్కూలుకి పడమరవైపుగా మాదిగగూడెం, ఎదురుగా కమ్మటూరు వుంటాయి. హాస్టల్ సౌకర్యం కూడా వుంది కాబట్టీ దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల దూరపు ఊళ్ల పిల్లలు కూడా ఉండేవారు. టీచర్లలో అన్ని మతాలవాళ్లూ వుండేవాళ్లు. నాకర్థం కాలేదో, అసలే లేదో కానీ.. పిల్లల్లో ఎవరు ఏ మతం అన్న పట్టింపులు వుండేవి కావు. మధ్యాహ్నం పన్నెండింటికి లాంగ్ బెల్ కొట్టగానే అందరం మోకాళ్లేసి ప్రేయర్ చేసేవాళ్లం. ఉత్సాహం వున్నోళ్లు బిగ్గరగా చెప్పొచ్చు. లేదంటే సైలెంట్‌గా నోరు మూసుకోని వుండొచ్చు. ప్రత్యేకించి వేరే మతప్రచారం ఏమీ జరిగేది కాదు. కానీ, హిందువుల పిల్లల్లో కూడా చాలామంది పొద్దున్నే బడికి రాగానే ముందు చర్చిలోకెళ్లి ఏసుక్రీస్తుకీ, మరియమ్మకీ దణ్నం పెట్టుకునేవారు. అలా దణ్నం పెట్టుకునే బ్యాచిలో నేను కూడా వుండేవాణ్ని. (కానీ, ఆరో తరగతిలో నేనొక అమ్మాయితో ప్రేమలో పడడమూ, ఆ ప్రేమకి హిందూ, క్రైస్తవ దేవుళ్లెవరూ పెద్దగా సహకరించకపోవడమూ జరిగినందున నేను నాస్తికుడిగా మారడానికి బీజం పడింది).
మారియో పుమ్మగల్లీ ఫాదర్ గారు స్కూలుకి కూతవేటు దూరంలో వున్న హాస్టల్ ఆవరణలో వుండేవాళ్లు. ఆయనకి తెలుగు సరిగ్గా రాదు. పిల్లలు స్కూలుకి పోయేముందు, ఇంటర్వెల్లో లంచ్ టైమ్‌లో ఆయన రూమ్ దగ్గరకి పోయి తలుపు కొట్టేవాళ్లు. ఏళ్ల తరబడి వందల వేలమంది పిల్లలు.... తలుపు కొట్టినప్పుడల్లా ఆయన ఓపిగ్గా తలుపు తీసి ఏం కావాలని అడిగేవారు. పెన్సిలో రబ్బరో స్కేలో అడగ్గానే లోపలికెళ్లి కొత్తది పట్టుకొచ్చి ఇచ్చేవాళ్లు. "వాళ్లకి బోలెడు ఫండ్సొస్తయ్. అందులో కొన్ని ఎంగిలి మెతుకులు విదిలించి వాళ్ల మతం వైపుకి తిప్పుకుంటారు" ఇలాంటి బొక్కలో కబుర్లు ఎన్నయినా చెప్పొచ్చు. కానీ, ఆయన ఓపిక, ప్రేమ కేవలం పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమలోనుండీ వచ్చినవే. "ఫాదర్గారు" అని తప్ప "ఫలానావాడు" అని ఏకవచనంతో ఆయన్ని అడ్రస్ చేసినవాళ్లు లేరు. మేము ఆ బడినుండీ బయటికొచ్చేశాక కొన్నాళ్లకి ఆయన ఇటలీ వెళ్లిపోయారనీ, అక్కడే చనిపోయారనీ తెలిసింది. కులాలు మతాలతో సంబంధం లేకుండా ఊరువూరంతా కంటతడి పెట్టింది. అనేక తరాలపాటు ఇంటిని కాపుకాసిన ఒక చెట్టు అకస్మాత్తుగా కూలిపోయినట్టు బాధపడింది. ఫాదర్గారు మా వూరివాళ్లకి అంత ప్రేమాస్పదుడు కావడానికి కారణం అయింది క్రైస్తవ మతమే అయితే.. నేనూ క్రైస్తవుణ్నే.
మొన్నొకసారి, వేరొకపోస్టులో నాకు చదువు చెప్పిన అంతమ్మ టీచర్‌గారి గురించి రాశాను. నాకు తెలిసినంతవరకూ ఆవిడ మరియమ్మ. మా మారియో పుమ్మగల్లీ ఫాదర్ గారే ఏసుక్రీస్తు. తంబుర సితార నాదములు, నావని నడిపించమనే వేడుకోళ్లూ.. గంగాతరంగ జటాకలాపాలూ పలుకూ బంగారమవడాలూ.. ఇవన్నీ వేర్వేరు మతాలు కాదు అని చెప్పిన ఆ స్కూలు, అక్కడి మనుషులు, స్నేహితులు నాకు క్రైస్తవం పట్ల ఒక సాఫ్ట్ కన్సర్న్ కలగడానికి కారణం అయ్యాయి. కానీ, ఆ తర్వాత నేను చూసిన క్రైస్తవం వేరు. ఏసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని మనుషులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలరో అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాక.. నా చిన్ననాటి అనుభూతుల్ని పదిలంగా కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది. ఆ విషయాలు మాట్లాడుకోడానికి ఇది సందర్భం కాదు.
ఫైనల్‌గా నాకు అర్థం అయ్యింది, నేను నమ్ముతూ వచ్చిందీ ఏంటంటే.. ప్రతి మతంలోనూ మంచీ వుంటుంది, పెంటా వుంటుంది. కొంతమంది మంచి వరకూ తీసుకుంటారు. కొంతమంది పెంటని మాత్రమే పులుముకుంటారు. మనం ఫాలో అయ్యే మతానికీ మన సంస్కారానికీ సంబంధం వుండదు. అంతకన్నా మహత్తరమైన సత్యం ఏంటంటే.. "మతం మనల్ని ఉద్ధరించాలి. మతాన్ని ఉద్ధరించడానికి మనం ఆపసోపాలు పడుతున్నామంటే.. ఆ మతం పట్లా దేవుడి పట్లా మనకసలు నమ్మకమే లేదని అర్థం". ఈ నిర్వచనం ప్రకారం చూసుకున్నప్పుడు.. పెపంచకంలో తొంభైశాతం మంది నాస్తికులే వుంటారు. దేవుడు వుండొచ్చు, లేకపోవొచ్చు. ఉంటే గింటే ఒక్కడే దేవుడయ్యుండొచ్చు, పదిమంది దేవుళ్లయ్యుండొచ్చు. కానీ, ఒక దేవుణ్ని తిడితే ఇంకో దేవుడు సంతోషిస్తాడనుకుంటే అసలు సదరు ఎంటిటీ దేవుడని పిలిపించుకోడానికి అనర్హుడు. ప్రస్తుతానికి స్వస్తి. ప్రతీ క్రిస్మస్ కీ పోయినట్టే సాయంత్రం చర్చికి పోవాల. "నిన్ను మా ఇంట్లో వెంకటేశ్వరస్వామి అని పిలుస్తాం అయ్యా" అని ఏసుక్రీస్తుకి ఓపాలి గుర్తు చెయ్యాల.
క్రైసవ సోదరులు, ముస్లిం బావలు, పార్శీ మామలూ, బౌద్ధ మరదళ్లూ.. ఇయ్యేం లేవు. సమస్త మానవాళికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది అర్థం కానివాడికి ఉగాదులూ లేవు, ఉషస్సులూ లేవు.
Discussion (0)