Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

ఎద్దుపెంట మ‌రియూ మాన‌సిక ఆరోగ్యం

Sridhar Bollepalli

bullshit

సిందూరం సినిమాలో.. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర్రావు (మాస్టారు) ఒక న‌క్స‌ల్ గ్రూపుకి పెద్ద దిక్కుగా వుంటాడు. క‌థ బిగిన్ అయిన‌ప్పుడు, న‌క్సల్ గ్రూపు లీడ‌ర్ ఇంకో కామ్రేడ్‌తో అంటాడు "నీ గురించి మాట్లాడుకోడానికి ఒకసారి కూర్చోవాలి" అని. దాన‌ర్థం ఏంటో ఆ గ్రూపులో అంద‌రికీ తెలుసు. రివిజ‌నిస్టు గానో, ఇన్‌ఫార్మ‌ర్‌గానో మారిన ద‌ళ స‌భ్యుణ్ని చంపేయ‌డానికి ఫిక్స్ అయ్యార‌న్న‌మాట‌. ఆ త‌ర్వాత జ‌రిగిన ర‌క‌ర‌కాల ప‌రిణామాల నేప‌ధ్యంలో మాస్టారికీ న‌క్సల్ గ్రూపు నాయ‌కుడికీ మ‌ధ్య డిఫ‌రెన్సెస్ వ‌స్తాయి. చివ‌రికొచ్చేస‌రికి న‌క్స‌ల్ గ్రూపు నాయ‌కుడంటాడు "మాస్టారూ, మ‌నం ఒకసారి కూర్చోని మీ గురించి మాట్లాడుకోవాలి" అని. మాస్టారికి అర్థం అవుతుంది త‌న టైమ్ అయిపోయింద‌ని.

మాస్టారు బ‌తికుండాలంటే ఏం చేసుండొచ్చు...?

  1. చావుబ‌తుకుల మ‌ధ్య ఊగిస‌లాడే జీవితాన్ని అసలు మొద‌లే ఎంచుకోకుండా.. ఆయ‌న ప‌నీ, ఉద్యోగం ఆయ‌న చూసుకోని వుండొచ్చు.
  2. ఈ మార్గం స‌రైంది కాదేమో అనే సందేహం వ‌చ్చిన‌ప్పుడు ఆరోగ్య కార‌ణాలో ఇంకోక‌టో సాకుగా చూపించి సైలెంట్‌గా అందులోనుండీ త‌ప్పుకోని వుండొచ్చు.
  3. జ‌రుగుతున్న‌ది త‌ప్పు అని తెలిసినా, అన్నీ మూసుకోని త‌న ప్రాణాన్ని కాపాడుకోవ‌డం కోసం.. బ‌య‌ట‌కి ఎలా క‌నిపిస్తే మంచిదో అలా క‌నిపిస్తూ వుండొచ్చు. కానీ, ఈ మూడు ఆప్ష‌న్ల‌లో ఏ ఒక్క‌దాన్ని ఎంచుకోవ‌డ‌మూ అంత సుల‌భం కాదు. మొద‌టిది మ‌న ప్రమేయం లేకుండా జ‌రిగిపోతుంది. రెండో ప‌ని చేయ‌డానికి క‌మిట్‌మెంట్ అడ్డం వ‌స్తుంది. మూడో ప‌ని చేయ‌కుండా మ‌న‌స్సాక్షి న‌స‌పెడుతూ వుంటుంది. సో, ఫైన‌ల్‌గా చ‌చ్చిపోవ‌డం త‌ప్ప మాస్టారికి వేరే ఆప్ష‌న్ లేదు అనేదొక్క‌టే నిజం.

పైన చెప్పుకున్న ఫినామినా వామ‌ప‌క్ష ఉద్య‌మాల‌కీ, లేదా మ‌త‌ప‌ర‌మైన అతివాద ధోర‌ణులు క‌నబ‌రిచే ప్ర‌చారాల‌కీ మాత్ర‌మే కాదు.. మ‌న జీవితంలోని చిన్న‌చిన్న ప‌రిచ‌యాల‌కి కూడా వ‌ర్తిస్తుంది. డ‌బ్బు, లైంగిక సుఖం, ఈగో శాటిస్‌ఫేక్ష‌న్‌, మొహ‌మాటం.. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌నం మ‌న‌కి ఇష్టం లేని రిలేష‌న్స్ లోకి దూరిపోయి, దిగ‌బ‌డిపోతాం. న‌డుము వ‌ర‌కూ మునిగాక మ‌న‌కి తెలిసిపోతూ వుంటుంది, ఈ ప్రాసెస్ మ‌నం అనుకున్న దిశ‌గా వెళ్ల‌ట్లేదూ, ఇందులో నుండీ బ‌య‌ట‌ప‌డితే సుఖం అని. కానీ, ఏదో బ‌ల‌హీన‌త మ‌న‌ల్ని మున‌క‌కే క‌ట్టిప‌డేస్తుంది. అలాంట‌ప్పుడు మ‌న మ‌న‌సు ఏం చెపుతుందంటే.. "నాయ‌నా, నువ్వు చాలా గొప్ప‌వాడివి, త్యాగ‌ధ‌నుడివి. భార‌త‌ర‌త్న అవార్డు పొంద‌డానికి నీకు అన్నివిధాలా అర్హ‌త వుంది. కేవ‌లం లోక‌క‌ళ్యాణం కోసం మాత్ర‌మే నువ్వు నిస్వార్థంగా ఈ ప‌ని చేస్తున్నావు" అని. "ఆహా నిజ‌మే క‌దా. నేనెంత ప‌రోప‌కారినీ" అని మ‌న భుజం మ‌నం చ‌రుచుకుంటాం. ఇదంతా ఎద్దుపెంట వ్య‌వ‌హారం. అన‌గా బుల్‌షిట్ అన్న‌మాట‌.

ఆరెస్సెస్‌నీ లేదా మావోయిస్టుల్నీ లేదా స్త్రీవాదుల్నీ లేదా ద‌ళిత‌వాదుల్నీ లేదా చంద్ర‌బాబునీ లేదా జ‌గ‌న్ నీ... మీరు ఎవ‌రి భ‌జ‌న గ్రూపులో చేరినా స‌రే.. మొద‌టి ద‌శ‌లో ల‌భించే గుర్తింపు చాలా ఆక‌ర్ష‌ణీయంగా వుంటుంది. (అయ్య‌ప్ప మాల మొద‌టిసారి వేసుకున్న వ్య‌క్తిని క‌న్నెస్వామి అంటారు. ఈ క‌న్నెసాముల‌కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. మూడోసారో, నాలుగోసారో మాల వేసుకున్న వాళ్ల‌క‌న్నా వీళ్లు ప‌వ‌ర్‌ఫుల్ అన్న‌ట్టు. పురాణాల్లో చెపుతారే.. అస్ఖ‌లిత బ్ర‌హ్మ‌చారి మాత్ర‌మే ఈ ప‌ని చేయాలి అని, అలాగ‌న్న‌మాట‌). సో, మ‌నం ఏ ఉద్య‌మంలో, లేదా ఏ వాదంలో శృతి క‌లిపినా స‌రే మ‌నకి క‌న్నెసామి హోదా వుంటుంది. అప్ప‌టివ‌ర‌కూ ఉల్ఫాగాడిలాగా లేదా జ‌ఫ్ఫా దానిలాగా ప‌రిగ‌ణించ‌బ‌డిన మ‌న మాట‌ల‌కి స‌డెన్‌గా ప్రాధాన్య‌త ఆపాదించ‌బ‌డుతుంది. జిల్లా ఎడిష‌న్ చివ‌రిపేజీలో రావాల్సిన వార్త మెయిన్ ఎడిష‌న్ ఫ‌స్టుపేజీలో రావ‌డం అంటే మాట‌లు కాదు. అలా మ‌న మాట‌లు ఒక నాలుగైదు సార్లు ప‌తాక‌శీర్షిక‌ల‌ని అలంక‌రిస్తాయి. ఆ త‌ర్వాత మొద‌ల‌వుతుంది అస‌లు కార్య‌క్ర‌మం.. "సార్ (లేదా మేడ‌మ్‌) మ‌నం ఒక‌సారి మీ గురించి మాట్లాడ్డానికి కూర్చోవాలి".

మ‌నం జీవితం ఎంత సుఖంగా, ప్ర‌శాంతంగా, సంతృప్తిక‌రంగా సాగుతుందీ అన్న‌ది.. ఈ ఎద్దుపెంట ప్ర‌హ‌స‌నానికి మ‌నం ఎంత దూరంగా వుంటామూ అన్న‌దానిమీద ఆధార‌ప‌డి వుంటుంది. అయితే, మ‌నం మాస్టారి విష‌యంలో చెప్పుకున్న‌ట్టు.. తొలుత‌గా దూరిపోవ‌డం అన్న‌ది మ‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగిపోతుంది. ప్రేమ‌, పెళ్లి, స్నేహం, వ్యాపారం, ఉద్య‌మం... ఎందులోనైనా..! జ‌ర‌గ‌బోయే అన‌ర్థాన్ని గ్ర‌హించి బ‌య‌ట‌కి రాగ‌ల ప్రాప్త‌కాల‌జ్ఞ‌త మ‌న‌లో వుందా? ఉంటే, రెండో ఆప్ష‌న్ ఉప‌యోగించి బ‌య‌టికొస్తాం. లేదూ, బ‌య‌ట ప్ర‌పంచంతో వుండే వైరుధ్యాల‌తో పోల్చుకుంటూ "మున‌కే సుఖ‌మ‌నుకోవోయ్.." అని పాడాల‌నిపిస్తుందా? చిక్కేలేదు.. తందాతా తానె తంద‌నాన‌..! చిన్న‌మెద‌డు చితికిపోయిన చిడ‌త‌ల అప్పారావు పాత్ర పోషిస్తూ ముందుకుపోడ‌మే. అదో ర‌కం సుఖం.

కానీ, ఎద్దుపెంట‌ని పులుముకుంటూ, ఆ దుర్గంధాన్ని భ‌రించ‌లేక‌, ఆ ద‌రిద్రాన్ని కావాల‌నే అంటించుకున్నామ‌ని ఒప్పుకోలేక‌.. అభిన‌వ‌ శిబిచ‌క్ర‌వర్తిగా ప్ర‌పంచం మ‌న‌ల్ని గుర్తించ‌డం లేద‌ని ఓ లాక్కోనీ, పీక్కోనీ మ‌ధ‌న‌ప‌డిపోతున్నార‌నుకోండీ.. అదీ అస‌లైన ద‌రిద్రం. మిమ్మ‌ల్ని మీరూ ప్రేమించుకోలేరు. సో, ఆబ్వియ‌స్లీ ఎదుటివాళ్లు మిమ్మ‌ల్ని ప్రేమించ‌డానికి స్కోపే లేదు. మ‌న లైఫులో వ‌దుల్చుకోవాల్సిన బుల్‌షిట్టు, వ‌ద‌ల‌లేని బుల్‌షిట్టు ఏవిట‌న్న‌ది మీరు సావ‌ధానంగా కూర్చోని ఆలోచించ‌డానికి ఈ ఆదివార‌మును కేటాయించున‌ట్లు వివిధ‌మ‌తాల దేవుళ్లు మీకు స‌హ‌క‌రించుగాక‌. చివ‌రిగా ఒక్క‌మాట‌. మిమ్మ‌ల్ని చూసి జాలిప‌డుతున్న‌ట్టు, ద్వేషిస్తున్న‌ట్టు, త‌ప్పు ప‌డుతున్న‌ట్టు క‌నిపించే చాలామంది ఈ ఎద్దుపెంట బాధితులే. వారిని చూసి ఉద్రేకానికి లోన‌గుట లేదా ఆత్మ‌న్యూన‌త‌కి లోన‌గుట త‌గ‌దు. మూడ‌వ ఆప్ష‌న్‌ని ఎంచుకున్నటువంటి వారి బాధాక‌ర జీవన‌శైలి ప‌ట్ల సానుభూతి చూపించుట‌యే మ‌న క‌ర్త‌వ్య‌ము మ‌రియు ధ‌ర్మ‌ము.

Discussion (0)