Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...
Cover image for మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

Sridhar Bollepalli

మొన్న సాయంత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్" సినిమా చూశాను. మొద‌ట్నించీ ఆహాలో వున్న ఈ సినిమాని ఈమ‌ధ్యే నెట్‌ఫ్లిక్స్ లో కూడా పెట్టారు. సినిమా బాగోలేద‌నీ, భ‌యాన‌క‌మైన రాడ్డ‌నీ చాలామంది (చాలామంది కాదు, దాదాపు చూసిన ప్ర‌తివొక్క‌రూ..) చెవిలో ఇల్లు క‌ట్టుకొని పోరిన‌ప్ప‌టికిన్నీ సాహ‌సించ‌డం వెన‌క మూడు కార‌ణాలు.
ఒక‌టి: ఇంత‌వ‌ర‌కూ అఖిల్ సినిమా ఒక్క‌టి కూడా చూళ్లేదు నేను. అస‌లెలా చేస్తున్నాడు ఈ పిల‌గాడు అనే క్యూరియాసిటీ.
రెండు: ఇంత పెద్ద బ్యాన‌ర్‌, భారీ బ‌డ్జెట్టు, మంచి టెక్నీషియ‌న్ల‌ని పెట్టుకొని కూడా ఇంత ఫ్లాప్ అయ్యే సినిమా ఎలా తీయ‌గ‌లిగాడో అనే అనుమానం.
మూడు: ఇది అన్నిటిక‌న్నా ప్ర‌ధాన‌మైన‌ది. నిజానికి ఇదొక్క‌టే కార‌ణం అని కూడా చెప్పొచ్చు. పూజాహెగ్డేని చూడాల‌ని.. చూస్తూ వుండాల‌ని.

ఈ సినిమా చూడాల‌నే ఆస‌క్తి వుండి, ఇంకా చూడ‌నివాళ్లు ఎవ‌రైనా వుంటే ద‌య‌చేసి ఈ పోస్టు చ‌ద‌వొద్దు అని రాయ‌ల‌నుకున్నాను. అలా రాస్తే బావుంటుంద‌ని. కానీ, నా మ‌న‌సులో ఫీలింగ్ మాత్రం.. "బొంగులే చ‌దివితే చ‌దివారు, లేక‌పోతే లేదు, నాకెందుకు. స్పాయిల‌ర్స్ వొద్ద‌నుకునేవాళ్లు ఎలాగూ చ‌ద‌వ‌రు. ఆ టిమ‌టిమ ఆపుకోలేనివాళ్లు ఎలాగూ చ‌దువుతారు". అద‌న్న‌మాట విష‌యం.

తారాగ‌ణంః
ఈ సినిమాకి పెద్ద మైన‌స్సుగా మారినాటిల్లో ఇదొక‌టి. పూజాహెగ్డే, సుడిగాలి సుధీర్‌, ఈషారెబ్బా (హీరో మొద‌టి పెళ్లి చూపుల్లో క‌నిపించిన పిల్ల‌), (కొంత‌వ‌ర‌కూ) వెన్నెల కిషోర్ మిన‌హా ఎవ‌రి ఫేసూ చూడాల‌నిపించ‌దు. వీళ్లంద‌రూ గ్లామ‌ర‌స్‌గా వున్నార‌నీ, మిగ‌తావాళ్ల ఫేసులు బాగోలేద‌నీ కాదు. ఆయా పాత్ర‌ల‌కి అవ‌స‌రం అయిన బాడీ లాంగ్వేజీ, డైలాగులు, ఎక్స్ ప్రెష‌న్స్ ఎవ్వ‌రికీ లేవు. హీరో కుటుంబంలో మందలు మందలుగా తిరిగే జ‌నాల్లో స‌గం మంది గ‌తంలో మ‌నం ఎప్పుడూ చూసివుండ‌నివాళ్లు. బేసిగ్గా కొత్త మొహాల‌ని చూడ్డానికి ఆడియ‌న్స్ సిద్ధంగా వుండ‌రు. మ‌నం చూస్తున్న‌ది సినిమా అని మ‌ర్చిపోయేలా చేయ‌గ‌లిగిన ద‌మ్ము ఆ రోల్ లోనూ, చేసినాయ‌న లేదా చేసినావిడ లోనూ వున్న‌ప్పుడు త‌ప్ప‌, తెర‌మీద క‌నిపించే ప్ర‌తి కొత్త మొహ‌మూ పంటికింద రాయిలాగా త‌గులుతూ వుంటుంది. అలాంటి రాళ్లు పుష్క‌లంగా వున్నాయ్ ఈ సిన్మాలో. సినిమా మొత్తం చూశాక కూడా మ‌న‌కి క‌థ అర్థం కాక‌పోవ‌డాన్ని బ‌ట్టి... ఈ సినిమాలో చేసిన న‌టీన‌టుల‌కి కూడా అస‌లేం జ‌రుగుతుందో తెలుస‌నుకోలేం. కాబ‌ట్టీ, వాళ్ల‌కిచ్చిన అర‌కొర డైలాగుల‌ని ఎంత మోతాదులో ఏ ఎమోష‌న్తో చెప్పాలో బోధ‌ప‌డని అయోమ‌యం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది.

కారెక్ట‌రైజేష‌న్ః
పుస్త‌కాల్లో అయినా, సినిమాల్లో అయినా.. పాఠ‌కుల‌కి లేదా ప్రేక్ష‌కుల‌కి తెలిసిన దానిక‌న్నా ర‌చ‌యిత లేదా ద‌ర్శ‌కుడికి ఒక్కో పాత్ర గురించి ఒక వందింత‌లు ఎక్కువ తెలిసుండాలి. ఆ వివ‌రాలకి క‌థ‌తో ఎలాంటి సంబంధ‌మూ లేక‌పోవ‌చ్చు. క‌నీసం ముఖ్య‌మైన పాత్ర‌ల విష‌యంలో అయినా ఆ పాత్ర విద్యార్హ‌త‌, ఆర్థిక స్థోమ‌త‌, వృత్తి, మేరిట‌ల్ స్టేట‌స్‌, మిగిలిన పాత్ర‌ల‌తో ఆ ప‌ర్టిక్యుల‌ర్ పాత్ర‌కి వుండే ఎమోష‌న‌ల్ బాండ్.. ఇత్యాదులు తెలిసుండ‌క‌పోతే.. క‌థ ముందుకు న‌డుస్తూనే వుంటుంది కానీ, కారెక్ట‌ర్లు దాన్ని వెనక్కి లాగుతూ వుంటాయి.

ఫ‌రెగ్జాంపుల్‌.. హీరో అమెరికా నుండీ ఇంటికొచ్చాడు. ఇల్లంతా చుట్టాల‌తో కోలాహ‌లంగా వుంది. ఏదో ఫార్మాలిటీ కోసం అన్న‌ట్టు అంద‌రూ వొక్క‌సారిగా మ‌నోడిమీద‌కి ఎగ‌బ‌డి వాళ్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అంత‌వ‌ర‌కూ బాగానే వుంది. రెండు నిముషాల త‌ర్వాత, కిచెన్లో పొయ్యిముందు నిల‌బ‌డి వున్న త‌ల్లి ద‌గ్గ‌ర‌కి వ‌చ్చాడు హీరో. గ‌ట్టిగా త‌ల్లిని వాటేసుకోని ప్రేమ‌గా రెండు మాట‌లు చెప్ప‌డం సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం ముట్టుకోను కూడా ముట్టుకోడు. "ఏం వండుతున్నావ్" అని అడుగుతాడు. "నీకిష్ట‌మైన‌వ‌న్నీ వండుతున్నా" అంట‌ది. నారాయ‌ణా..!! ఆవిడ స‌వ‌తి త‌ల్లా? వాళ్లిద్ద‌రికీ ఏవైనా పాత ప‌గ‌లున్నాయా, ఆ స‌మాచారానికి క‌థ‌తో సంబంధం లేదు కాబ‌ట్టీ డైరెట్రు మ‌న‌కి చెప్ప‌కుండా వ‌దిలేశాడా? అనుమానం నాకు. వాటేసుకుంటేనే ప్రేమున్న‌ట్టా అనొద్దు మీరు. ఆ కుర్రాడి ఆలోచ‌న‌లు, ఆ త‌ల్లి మ‌న‌స్త‌త్వం తెర‌మీద చూశాక‌.. అత‌డు త‌ల్లిని చుట్టేసుకోక‌పోవ‌డం ముమ్మాటికీ అస‌హ‌జ‌మే. ఇక మిగ‌తా పాత్ర‌ల గురించి మాట్లాడుకోవ‌డం శుద్ధ‌దండ‌గ‌.

పాట‌లుః
గుచ్చే గులాబి లాగా, లెహ‌రాయీ రెండూ చాలా బావున్నాయ్‌. కానీ, లాక్‌డౌన్ టైమంతా "గుచ్చే గులాబి లాగా" పాట‌తోనే గ‌డ‌చిపోయిన కార‌ణంగా, ఫ్రెష్‌నెస్ పోయిందేమో. నాకు మాత్రం "లెహ‌రాయీ" పాట పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది. మిగిలిన పాట‌లు అలా వ‌చ్చెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం గుర్తే లేవు.

హీరో హీరోయిన్లుః
అఖిల్ మాట్లాడుతున్నంత సేపూ నాగార్జునా, మ‌హేష్ బాబూ గుర్తుకొచ్చారు నాకు. పిల్లోడు ఇంకా బాగా న‌లిగి, త‌న‌దైన సొంత స్ట‌యిల్ ఏర్ప‌రుచుకోవాలి. పెద్ద బ‌డ్జెట్ సినిమాల్లో హీరోగా నిల‌బ‌డాలంటే.. ఏమాత్రం ప‌స‌లేని డైలాగుని కూడా ఏదో వొక మాజిక్ చేసి పైకి లేప‌గ‌లిగే స్పార్క్ వుండితీరాలి. ఆ మాజిక్ అల్లు అర్జున్‌, రామ్‌, ర‌వితేజ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్ల‌లో క‌న‌బ‌డుతుంది నాకు. బాగా పేల‌డానికి ఛాన్స్ వున్న డైలాగేదో రాసి, డైరెట్రు దాన్ని బా....గా తీసి, పాడింగ్ ఆర్టిస్టులంతా త‌లోచేయీ వేసిన‌ప్పుడు "అబ్బా భ‌లే వుందే" అని మ‌న‌కి అనిపించొచ్చు. కానీ, ఇలా అన్నీ క‌లిసిరావ‌డం సినిమాలో నాలుగైదు డైలాగుల విష‌యంలోనే జ‌రుగుతుంది. మిగ‌తా పార్టంతా ఆర్టిస్టులు లాక్కు రావాల్సిందే. ఫ‌స్టాఫ్‌లో చాక్లెట్ బాయ్ లాగా వున్న అఖిల్‌, సెంక‌డాఫ్‌లో జుట్టు, గ‌డ్డం పెంచి మాన్లీగా అనిపించాడు. కానీ, త‌న భుజాల మీద ఏస్కోని స‌న్నివేశాల్ని వొడ్డున ప‌డేసే రేంజి రావాలంటే ఈ పిల్లోడికి చాలాకాలం ప‌ట్టేలా వుంది. (అస‌లెప్ప‌టికీ చేయ‌లేడు అని కూడా అనాల‌ని వుంది కానీ... ఏంటో మ‌న‌సొప్ప‌డం లేదు).

ఒక సినిమాలో క‌నీసం గంట‌సేపు తెర‌మీద క‌నిపించే అవ‌కాశం పూజాహెగ్డేకి రావ‌డం ఇదే మొద‌టిసారి అనుకుంటాను ( అట్ లీస్ట్ తెలుగు సినిమాల్లో). ఆ అమ్మాయి చేయ‌లేని (ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌డానికి అవ‌కాశం రాని) ఎమోష‌న్స్ ఈ సినిమాలో హీరోయిన్ కి చాలానే వున్నాయ్‌. చాలాచోట్ల తేలిపోయింది. ముఖ్యంగా క్ల‌యిమాక్స్ కి ముందొచ్చే పార్టీ సీన్ లో పూజా ఫ‌ర్ఫామ‌న్స్ వెరీ డిజ‌పాయింటింగ్. అయిన‌నూ.. అయిన‌నూ.. అయిన‌నూ.. రెండు క‌ళ్లూ చాల‌నంత అందంగా వుంది పిల్ల‌. బాహ్య సౌంద‌ర్యం ప‌ట్ల తీవ్రాతితీవ్ర‌మైన టిమ‌టిమ వున్న నాలాంటి వాళ్ల‌కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చితీరుతుంది. డబ్బులు పెట్టి టికెట్ కొని థియేట‌ర్ల‌కి పోయినోళ్లు చ‌చ్చిన‌ట్టు ఎలాగూ చివ‌రిదాకా కూచుంటారు. కానీ, ఓటీటీల్లో చూసేవాళ్లు స్కిప్ చేయ‌కుండా చివ‌రిదాకా వున్నారంటే దానికి కార‌ణం చాలావ‌ర‌కూ పూజాహెగ్డే అంద‌మే.

డైరెట్రుగారుః

రూపాయి ఖ‌ర్చు లేకుండా వేరేవాళ్ల యూజ‌ర్ ఐడీ అడుక్కోని (AHA app user ID, password ఇచ్చినందుకు thanks అక్కా) బేవార్సుగా సినిమా చూసే నాలాంటివాళ్లు వంద స‌ల‌హాలివ్వొచ్చు. బోడి షార్ట్ ఫిల్మ్ తీయాలంటే నానా ఆమ్‌పిట్స్ నాకాలి. పైగా నాగార్జునా, అల్లు అర‌వింద్ లాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ అంటే స‌వాల‌క్ష వొత్తిళ్లు, ప‌రిమితులు వుంటాయి. ఇవ‌న్నీ నాకు తెలియ‌నివి కావు. కానీ... జ‌నాల‌కి ఏది న‌చ్చుతుందో, ఏది న‌చ్చ‌దో భాస్క‌ర్‌కి అర్థం కాలేద‌నే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల eccentric behavior ని జ‌స్టిఫై చేయ‌డానికి.. వాళ్ల చుట్టూతా వంద ఏడుపుగొట్టు మొహాల‌ని పెడితే స‌రిపోతుంది అనుకోవ‌డం క‌రెక్ట్ కాదు. నిజ జీవితంలో మెజారిటీ ప్ర‌జానీకం అలాంటి ఏడుపుగొట్టు జీవితాల‌ని గ‌డుపుతున్నారా లేదా అన్న‌ది ప‌క్క‌న‌పెడితే.. వాళ్ల సోది ఏడుపు, సోది వాగుడు ప్రేక్ష‌కులు ఎందుకు భ‌రిస్తారు? ఈ హింస కంటే హీరోహీరోయిన్ల సోదే మెరుగు అని ఆడియ‌న్స్ అనుకోడానికేనా? ఏమోన‌బ్బా.

క‌థః
"మీ సినిమాలో పాట‌లు లేవేటండీ, ఇడ్డూరం కాక‌పోతేనూ" అని ఒక‌సారి ఎవ‌రో క‌మ‌ల్ హ‌స‌న్ని అడిగితే, మ‌నోడిలా జ‌వాబిచ్చాడు, "అస‌లు క‌థే లేని సినిమాలు వంద‌లొస్తంటే, బొక్క‌లో పాట‌ల గురించి ప‌ట్టింపేమిటీ?".. నిజ‌మే! పిచ్చి క‌థ‌లు, చెత్త క‌థ‌లు, అక‌థ‌లు, కుక‌థ‌లు, విక‌థ‌లు కూడా చెప్ప‌డం చేత‌నైతే స‌ర‌దాగా కాల‌క్షేపం చేయిస్తాయి. అంచేత‌, ఈ సినిమా క‌థ బాలేద‌ని నేన‌న‌ను. అన‌వ‌స‌ర‌పు చెత్త పాత్ర‌ల్ని పీకేసి, కొన్ని పాత్ర‌ల‌కి వేరేవాళ్ల‌ని పెట్టుకొని, ఆస‌క్తిక‌ర‌మైన డైలాగులు రాసుకుంటే ఇదే క‌థ‌తో సూప‌ర్‌హిట్ సినిమా తీయ‌డం సాధ్య‌మే అనేది నా ఒపీనియ‌ను. Of course, ఆ సినిమాలో కూడా పూజాహెగ్డే మాత్రం వుండి తీర‌వ‌లె..! మ‌రియు, ఆవిడ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కాకుండా, ఇంకేదో ప్రొఫెష‌న్లో వుండుండాలి.

కంక్లూజ‌న్ః
ఆర్టు సినిమాలు, ఆఫ్ బీట్ సినిమాలు ఇష్ట‌ప‌డేవాళ్లు నా రివ్యూ చూసి నా మాన‌సిక ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందే అవ‌కాశం వుంది. కానీ, ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే ఒక స‌గ‌టు ప్రేక్ష‌కుడి గోల మాత్ర‌మే ఇదంతా. The Shawshank Redemption, Joker, Forest Gump, The Roman Holiday, Citizen Kane త‌దిత‌ర సినిమాల‌ని నేను కూడా చూసి, ఆస్వాదించి, ప‌ర‌వ‌శించియుంటిని. ఆ ట్రాకు వేరే. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. ఈ సినిమా నాకు న‌చ్చిందా? లేదు..! మ‌రి, సినిమాని ఎంజాయ్ చేశానా? డౌటే లేదు, ఫుల్లుగా..!

Discussion (0)