Logic RACE

Logic RACE - తెలుగు జాతి. మీరు తెలుగు వారా? జాయిన్ అయ్యి, చట్ట విరుద్దం కాని ఏ విషయమైనా స్వేచ్చగా పోస్టు చేయండి.

Logic RACE is Telugu people from Andhra Pradesh, Telangana, India and worldwide.

Join the RACE Log in
loading...

ఇది యిలా కాకుండా వుంటే.. అది అలా అయ్యేదా..?!

Sridhar Bollepalli

2004 లో గ్రూప్ వ‌న్ కోచింగ్ తీస్కోడానికి హైద్రాబాద్ వెళ్లాను. క్లాసులు బోర్ కొట్టేసిన‌య్‌. అదే స‌మ‌యానికి టీవీ9 స్టార్ట్ అవ్వ‌డం, ఎలాగూ లీవ్ పెట్టాం క‌దా అని నేను టీవీ9లో జాబ్ కి అప్లై చేయ‌డం, వాళ్లు ర‌మ్మ‌న‌డం జ‌రిగిపోయింది. అప్పుడు టీవీ9 లో చేర‌కుండా కోచింగ్ లో కంటిన్యూ అయ్యుంటే ఏం జ‌రిగేది? నేను గ్రూప్ వ‌న్ ఆఫీస‌ర్ అయ్యుండేవాణ్నా? అయ్యుండేవాణ్ని కాదా? రిజ‌ల్ట్ వ‌చ్చాక వీడు మ‌న‌మ‌నుకున్నంత తోపేం కాదు, బుర్ర‌త‌క్కువోడే అని జ‌నాలు నా గురించి అనుకునేవాళ్లా? ఆ డిప్రెష‌న్‌తో నేను మందుకి అల‌వాటు ప‌డేవాణ్నా? న‌ల్ల‌కుంట నుండీ అశోక్ న‌గ‌ర్ క్లాసుల‌కి పోతా ఏ చిక్క‌డ‌ప‌ల్లి చౌర‌స్తాలోనో యాక్సిడెంట్ అయ్యి, పుటుక్కున పోయేవాణ్నా? ఒక‌వేళ జాబ్ వ‌చ్చుంటే, అది నాకు న‌చ్చేదా? నా ప‌నితీరు న‌చ్చ‌ని వాళ్లెవ‌రైనా న‌న్ను కాల్చి చంపేసేవాళ్లా? క‌చ్చితంగా యిలాగే జ‌రిగివుండేది అని చెప్పలేం.

గాంధీగారు 1915 లో యిండియాకి రాకుండే వుంటే ఏమ‌య్యేది? ఒక ఐదేళ్లు ముందో వెనుకో వ‌స్తే? అప్పుడెవ‌రైనా కొత్త లీడ‌ర్ ఎమ‌ర్జ్ అయ్యుండేవాడా? అస‌లు గాంధీ అనే మ‌నిషే లేకుండా వుంటే? జాతీయ‌పోరాటం వేరే విధంగా వుండేదా? ఇండియా హిందూదేశంగా మారిపోయుండేదా? లేదా పూర్తి సోష‌లిస్టు స‌మాజంగా మారిపోయేదా? క‌ళ్ల ఎదురుగా క‌న‌బ‌డుతున్న ల‌క్ష‌ల విష‌యాల‌ని అర్థం చేసుకోలేక రోజుకి వంద‌సార్లు నాలిక్క‌రుచుకొని, పూట‌కొక‌సారి పార‌డైమ్ షిఫ్ట్ కి లోన‌య్యే మ‌నం పై ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలు ఎప్ప‌టికీ చెప్ప‌లేం. ఊహాగానాల‌దేవుంది. ఎన్న‌యినా చేయొచ్చు. ఒక్క‌టి మాత్రం నిజం. గాంధీగారు వున్నా లేక‌పోయినా ఫ్రీడ‌మ్ మాత్రం కొంచెం అటూయిటుగా 1947 లోనే వ‌చ్చుండేది. ఎందుకంటే, దానిని ప్ర‌భావితం చేసింది మ‌న పోరాటాలు మాత్ర‌మే కాదు. ప్ర‌పంచవ్యాప్తంగా చోటుచేసుకున్న అనేక ప‌రిణామాలు.

గాంధీగారిని మహాత్ముడిగా చూడ‌డానికీ.. ఫ్రీడ‌మ్ మూమెంట్‌లో ఆయ‌న పాత్ర ఏంటీ అన్న‌దానికీ అస‌లు సంబంధ‌మే లేదు అని నా వుద్దేశం. వ్య‌క్తిగ‌త‌ జీవితంలో ఆయ‌న పాటించిన విలువ‌లు, స‌త్యానికి ఆయ‌నిచ్చిన ప్రాధాన్య‌త చాలు. ద‌క్షిణాఫ్రికాలో ఆయ‌న పోరాటం మ‌రుగుదొడ్లు శుభ్రం చేయ‌డంతో మొద‌లైంది. మ‌న‌ల్ని మ‌నం సంస్క‌రించుకోకుండా, క‌నీస శుభ్ర‌త పాటించుకుండా బ‌య‌టినుండీ వ‌చ్చే హ‌క్కుల్ని ఆశించలేం అని ఆయ‌న చెప్ప‌డం, ఎవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోయినా ఆయ‌నే స్వ‌యంగా మ‌రుగుదొడ్లు శుభ్రం చేయ‌డం చాలామందిని నివ్వెర‌ప‌రిచింది. స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో కూడా యిలా మ‌రుగుదొడ్లు శుభ్రం చేయ‌డం అనే కాన్సెప్ట్ చాలామంది పెద్ద త‌ల‌కాయ‌ల‌కి న‌చ్చ‌లేదు. కానీ, ఆయ‌న ఏనాడూ వొక‌ళ్ల‌ని యింప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇది స‌త్యం, యిది మంచి అని తాను న‌మ్మిన సిద్ధాంతాల‌ని బ‌తికున్న‌న్నాళ్లూ రాజీ ప‌డ‌కుండా ఫాలో అయ్యాడు.

వ్య‌క్తులు చ‌రిత్ర‌ని సృష్టించ‌రు. చ‌రిత్ర వ్య‌క్తుల్ని త‌యారు చేసుకుంటుంది. మ‌న‌దేశంలో కానీ, ప్ర‌పంచంలో కానీ ఆనాడున్న ప‌రిస్థితుల‌కి త‌గ్గ‌ట్టు భార‌త జాతీయోద్య‌మాన్ని ఛానెలైజ్ చేయ‌డానికి చ‌రిత్ర వుప‌యోగించుకున్న ప‌నిముట్టు గాంధీజీ. ఆయ‌న నిర్ణ‌యాలు దోపిడీదారుల‌కి వుప‌యోగ‌ప‌డ్డాయ‌నీ, పోరాటాన్ని వెన‌క‌ప‌ట్టు ప‌ట్టించాయ‌నీ కొంద‌రంటారు. అందులో పాక్షికంగా నిజం వుందేమో కూడా. కానీ, అది ఆయ‌న వుద్దేశ‌పూర్వ‌కంగా చేసింది కాదు. ఈరోజున సోష‌ల్ మీడియాని తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స్థితిలో వున్న ఎక్స్ట్రీమ్ రైట్‌, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ ద‌ళిత్ గ్రూపులు ఆయ‌న్ని డిజ్ వోన్ చేసుకున్న‌ట్లు అర్థం అవుతోంది. వాట్స‌ప్ లో వ‌చ్చే పిచ్చిపుల్కా సందేశాలు చ‌ద‌వి, ఎన్‌సైక్లోపీడియాలం అయిపోయాం అనుకునే కొత్త‌త‌రం గాంధీజీని దేశ‌ద్రోహిగా చూసేదాకా వెళ్లిపోయారు. (వీళ్లలో చాలామందికి అగ‌స్టు 15 కీ, జ‌న‌వ‌రి 26 కీ తేడా తెలీద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు).

అంబేద్క‌ర్‌కీ, ప‌టేల్‌కీ, బోసుకీ, భ‌గ‌త్ సింగుకీ, అల్లూరి సీతారామ‌రాజుకీ వున్న‌దానిక‌న్నా గాంధీగారికి వున్న ఫ్యాన్స్ త‌క్కువేమో అనిపిస్తుంది ఈ రోజున‌. చివ‌రికి గాంధీగారు వైశ్యుల నాయకుడిగా మిగిలిపోతాడేమో అని కూడా అనిపిస్తుంది. ఈ ప‌రిణామం నాకు బాధాక‌రం. డ‌బ్బు, కులం, మతం పునాదులుగా పుట్టి, జనాల‌మ‌ధ్య విభేదాలు, ప్రాంతాల మ‌ధ్య చీలిక‌లు సృష్టించ‌డం ద్వారా మ‌నుగ‌డ సాగిస్తూ కుళ్లుకంపు కొడుతున్న కొన్ని (దాదాపు అన్నీ) పార్టీల‌కి జేజేలు కొడుతూ.. ఎవ‌డైతే పేద‌ప్ర‌జ‌లు క‌డుపు కొట్టాడో వాడి ప‌ల్ల‌కీ మోయ‌డానికీ, వాడి మోచేతి నీళ్లు తాగ‌డానికీ.. త‌మ సొంత వ్య‌క్తిత్వాల‌నీ, త‌మ వ‌ర్గం అస్తిత్వాల‌నీ తాక‌ట్టు పెడుతున్న కొంద‌రు అభ్యుద‌య‌వాదులు కూడా గాంధీగారిని త‌ప్పుబ‌ట్ట‌డం చూస్తే చాలా బాధ‌గా వుంది.

అవును..! ఒక సామెత వుంది క‌దా. కమ్యూనిజానికి పెద్ద శ‌త్రువు ఎవ‌రంటే మాజీ క‌మ్యూనిస్టులే. నువ్వొక కొత్త సిద్ధాంతాన్ని భుజానేసుకోవాలంటే పాత సిద్ధాంతాల్లో బ‌ల‌మైన దానిమీదే బుర‌ద జ‌ల్లాల్సింది. అలాగే, నువ్వొకణ్ని కొత్తా దేవుడండీ అని కీర్తించాలంటే.. ముందు బుర‌ద జ‌ల్లాల్సింది గాంధీజీ మీదే. మిగ‌తావాళ్ల మీద చ‌ల్లినా, చ‌ల్ల‌క‌పోయినా వొక‌టే.. బుర‌ద బొక్క‌!

Discussion (0)