నైంటీస్ మొదట్లో నేను సీపీఎం వైపు ఆకర్షితుణ్ని అవుతున్న సమయంలో ఒక కవిత చదివాను. "నరుడు మళ్లీ వానరుడు అవుతాడనీ, ధరిత్రి బల్లపరుపుగా వుందనీ నమ్మని ఆశావాదులం మేము.." ఈ కవిత రాసింది తెలకపల్లి రవిగారు. రష్యాలో, తూర్పు యూరప్‌లో ఎర్రజెండాలన్నీ అవనతం చేయబడుతున్న సందర్భంలో.. మళ్లీ సోషలిజానికి పూర్వవైభవం వస్తుందనే ఆప్టిమిస్టిక్ వైఖరిని ప్రదర్శిస్తూ రాశారాయన.
అప్పట్లో మాకు చాలా ఉత్సాహానిచ్చిన కవిత అది. (భారతదేశంలో వున్న కుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోని కారణంగా కొంత, అసలు ప్రపంచం మొత్తంగానే కొత్త తరం మనుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పుల కారణంగా కొంత ఇండియాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికి నామమాత్రం అయిపోయిందనుకోండీ, అది వేరే విషయం). అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి కమ్యూనిజం ఒక్కటే మార్గం అనీ, ఏనాటికైనా ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించక మానదనీ నమ్మేవాళ్లం. కానీ, ఈరోజున నాకు ఆ నమ్మకం వుందా? లేదంటే లేదు. మానవజాతికి కమ్యూనిస్టు సిద్ధాంతం, కమ్యూనిస్టు పార్టీలు చేసిన కాంట్రిబ్యూషన్ ని తలుచుకుంటూనే, అందుకు నా కృతజ్ఞతని పదేపదే చెప్పుకుంటూనే... నా పరిమిత జ్ఞానానికి నాకు అనిపిస్తున్నది ఏంటంటే.. కమ్యూనిజం అన్నది కేవలం చరిత్ర. ఇక దానికి భవిష్యత్తు లేదు.
మా చిన్నప్పుడు.. సినిమాల్లో చూపించే ప్రేమకథలు, అక్కడక్కడా కనిపిస్తూ వినిపిస్తూ వుండే కులాంతర వివాహాలని దృష్టిలో వుంచుకొని మేము అనుకునేవాళ్లం.. "మనం పెద్దోళ్లం అయ్యేసరికి కులానికి అసలు ప్రాధాన్యత లేకుండా పోయిద్ది. మనకి పిల్లలు పుట్టి, వాళ్లకి పెళ్లిళ్లు చేయాల్సిన సమయం వచ్చేసరికి అసలు కులం అన్న ఊసే వుండదు".. అలా కులం అన్న ఊసే లేకుండా పోయిందా? సమస్యే లేదు. ఇంకా కులం అనేది అంతే గట్టిగా వుంది. ఇప్పటికీ రాజకీయాలన్నీ కులం చుట్టూతానే తిరుగుతున్నాయ్. పెద్ద కులపోళక్లు కింది కులాలని హీనంగానే చూస్తున్నారు. బహిరంగంగా తూలనాడకపోయినా వాళ్ల ప్రైవేటు సంభాషణల్లో మాత్రం "ఆ లం..లంతా యింతే, అందుగ్గాదూ వాళ్లక్కడే ఆగిపోయిందీ" అనే మాటలు వాడబడుతూనే వున్నాయ్. ఒక భావజాలం వల్ల లబ్ది పొందేవాడెవ్వడూ, దానికి వ్యతిరేకంగా పోయి లాభాల్ని వదులుకోవాలని అనుకోడు. కాబట్టీ, పెద్ద కులపోళ్లలో చాలామంది అలా వుండడం సహజం (సమర్థనీయం కాదు), కానీ కింది కులాలుగా చూడబడే వాటిల్లో కూడా ఈ పెంట తక్కువగా ఏమీ లేదు. మాలకులస్తులకి మాదిగ కులస్తులంటే హీనభావం. మాదిగ కులస్తులకి మాల కులస్తులంటే ఏహ్యభావం. వీళ్లిద్దరంటే లంబాడీలకి అంతకన్నా తక్కువైన భావం. ఉపరితలంలో కనిపిస్తున్న మార్పులని గుర్తిస్తూనే.. సమీప భవిష్యత్తులో కులం ప్రభావం పోతుందని అనుకునే భ్రమల్లో నేనున్నానా? నో..!
దేశంలో ఎక్కువమంది నిరక్షరాస్యులున్న కారణంగా పనికిమాలిన రాజకీయనాయకుల ఆటలు సాగుతున్నాయనీ, పెజానీకం అంతా బాగా చదివేసుకుంటే గొప్పగొప్పోళ్లనే ఎన్నుకుంటారనీ అనుకునేవాణ్ని నేను చిన్నప్పుడు. అలాగే, యువకులు రాజకీయాల్లోకి వస్తే నీతిమాలిన రాజకీయాలకి ఆస్కారం వుండదనే పిచ్చిపుల్లయ్య కబుర్లు కూడా నమ్మేసేవాణ్ని. కట్ చేస్తే.. చదువుకున్నోళ్లకి ఎక్కువ కామన్ సెన్స్ వుంటుందనే థాట్‌ని సపోర్ట్ చేసే పరిణామాలేవీ సంభవించలేదు. ముసలి నాయకులు యాభై ఏళ్లలో సంపాదించినంత ఓవర్ నైట్ లో సంపాదించేయాలనే తాపత్రయం తప్ప యువతలో పెద్ద పొడిచేసే లక్షణాలేవీ కనబళ్లేదు నాకు. పరిపాలనా సామర్థ్యం కాదూ బొక్కా కాదు. జనాలకి ఫ్రీ గా అకౌంట్లలో డబ్బులు పడడం కావాలి. ఆ పని జగన్ చేస్తాడని జనాలు నమ్ముతున్నారు. అంతకంటే ఎక్కువ హామీలు యిచ్చినా యిప్పటికిప్పుడు చంద్రబాబుకి ఓటేస్తారా అంటే అనుమానమే. ఒకవేళ తాను కూడా అలాగే క్రమం తప్పకుండా డబ్బులు అకౌంట్లో వేస్తానని చంద్రబాబు నమ్మించగలిగితే జగన్ కి ఓట్లేసినోళ్లంతా పోలోమని అటువైపుకి దూకుతారు. రాజకీయాలు ఇంతకంటే మెరుగ్గా వుంటాయి భవిష్యత్తులో అని నాకు నమ్మకం వుందా? అస్సల్లేదు. ఇక జాతీయ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవినీతి గబ్బుని వదిలించుకునే ప్రయత్నంలో ఇంకా పెద్ద గబ్బుని సబ్బులాగా పూసుకోవాల్సొచ్చింది. అదంతా వేరే చర్చ.
తనకి తానుగా ఏమీ సాధించలేనివాడు తన నేపథ్యంలోనో, లేదా కులం, మతం, దేశం, ప్రాంతం లాంటి వాటిల్లోనో ఏదో చూసుకోని మురిసిపోతుంటాడు. వాడొక శుంఠ అని వాడికే అర్థం కాకుండా వుండాలంటే ఆమాత్రం రక్షకతంత్రాన్ని ఆసరా తెచ్చుకోవడం మనిషికి తప్పనిసరి. ఎంతో కొంత సాధించినవాడు కూడా అంతకంటే పైకెళ్లడానికి ఇవే నిచ్చెనమెట్లుగా వాడుకోవాలనుకుంటాడు. అలా సమర్థవంతంగా వాడుకోగలిగిన వాడు వాడికి ఉపయోగపడే సిద్ధాంతాన్ని గొప్ప ఆదర్శంగా ప్రచారంలో పెడతాడు. ఎవడికి వాడు వాడెలా పైకి రావాలో ఆలోచించుకోని, దానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే తప్ప.. అందరికీ మంచి చేసే గొప్ప మార్పు ఏదో జరిగిపోద్దని అనుకోవడం బుర్రతక్కువతనం. ఇది తెలిసినోడు బాగుపడతాడు. వాడు చేసేది వుద్యోగం అయినా, వ్యాపారం అయినా, రాజకీయం అయినా, సామాజిక సేవ అయినా సరే అందులో తనకేంటీ అన్నది ఆలోచించుకుంటూ కెరీరిస్టు ధోరణితోనే ముందుకు పోతుంటాడు. మిగిలిన గొర్రెలన్నీ తలకాయలూపుకుంటూ తలా ఒక మందగా మారి నడుస్తా నడుస్తా వుంటారు. అదన్నమాట సంగతి.
Discussion (0)